Pharma Shares: ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్‌

ఫార్మా కంపెనీలపై స్టాక్‌మార్కెట్‌ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్‌-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి.

Updated : 02 Jul 2024 08:18 IST

కొవిడ్‌-19 పరిణామాలు ముగిశాక పతనమైన షేర్ల ధరలు 
రెండేళ్లుగా స్తబ్దుగానే
మళ్లీ పరిశ్రమ ఆదాయాలు, లాభాలపై సానుకూల అంచనాల వల్లే రాణింపు 
ఈనాడు, హైదరాబాద్‌

ఫార్మా కంపెనీలపై స్టాక్‌మార్కెట్‌ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్‌-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. ఫలితంగా ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి ఫార్మా కంపెనీల షేర్ల ధరలు అప్పట్లో పెరగడంతో, వాటి మార్కెట్‌ విలువ అనూహ్యంగా అధికమైంది. కొవిడ్‌-19 పరిణామాలు ముగిశాక, ఫార్మా కంపెనీల ఆదాయాలు తగ్గడంతో, వాటి షేర్ల ధరలూ పతనం అయ్యాయి. గరిష్ఠ స్థాయి నుంచి సగానికి షేర్ల ధరలు క్షీణించాయి. తదుపరి స్టాక్‌మార్కెట్‌ సూచీలు సరికొత్త గరిష్ఠ స్థాయులను తాకుతుంటే, బ్యాంకింగ్, ఫైనాన్స్, రక్షణ, ఇంధన రంగాల కంపెనీల షేర్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్లుగా పెరిగిపోయాయి. ఫార్మాలో కొన్ని కంపెనీల షేర్లు మినహా, అత్యధిక కంపెనీల షేర్లు గత రెండేళ్లుగా నేలచూపులు చూస్తూ ఉండిపోయాయి. 

పరిస్థితులు అనుకూలిస్తున్నందునే

  • ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఫార్మా కంపెనీలకు పరిస్థితులు అనుకూలిస్తున్నందున, ఈ షేర్లపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొనుగోళ్లు వస్తున్నందున, ఆయా కంపెనీల షేర్ల ధరలు పెరుగుతూ, మళ్లీ గరిష్ఠ స్థాయులను చేరుకుంటున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్, దివీస్‌ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా, జేబీ కెమికల్స్, గ్లాండ్‌ ఫార్మా, సువెన్‌ ఫార్మా, వోఖార్ట్, ఆర్చిడ్‌ ఫార్మా, బయోకాన్, న్యూల్యాండ్‌ ల్యాబ్స్‌.. షేర్లే దీనికి ఉదాహరణ. 
  • ఇతర రంగాలతో పోల్చితే ఫార్మా కంపెనీల షేర్ల ధరలు తక్కువగా ఉండటం
  • రిస్కు- రివార్డు నిష్పత్తి సానుకూలంగా కనిపించడం,
  • సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు కనిపించడం వంటివి మదుపర్ల ఆసక్తికి కారణం.

ఎగుమతులు పెరగడం వల్లా

మనదేశం నుంచి మందుల ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మందుల ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్లను మించుతాయని అంచనా. సీడీఎంఓ (కాంట్రాక్టు అభివృద్ధి, ఉత్పత్తి) అవకాశాలూ ఫార్మా కంపెనీలకు అధికంగా లభిస్తున్నాయి. ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి దాదాపు 98 బయోసిమిలర్‌ ఔషధాలకు అనుమతి ఇచ్చింది. దీనికి తోడు 2030 నాటికి 130 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ కలిగిన మందులకు అమెరికా, కెనడా, యూకే..తదితర దేశాల్లో పేటెంట్‌ గడువు తీరనుంది. ఇవన్నీ మనదేశ ఫార్మా కంపెనీలకు కలిసొచ్చే అంశాలు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఫార్మా కంపెనీలు పరిశోధన- అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. దీనికి తోడు దేశీయ మార్కెట్‌ కూడా విస్తరిస్తోంది. గుండెజబ్బులు, క్యాన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించిన మందుల వినియోగం పెరుగుతోంది.  

ఈ ధరలు చూస్తే..

బీఎస్‌ఈలో సోమవారం వోఖార్ట్‌ షేరు 20% పెరిగింది. క్రితం రోజు ముగింపు కంటే రూ.137 పెరిగి రూ.823 ముగింపు ధర నమోదు చేసింది. సువెన్‌ ఫార్మా రూ.20 పెరిగి రూ.824కు; నాట్కో ఫార్మా రూ.32 అధికమై రూ.1198కు చేరాయి. న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ రూ.241 (3.23%) పెరిగి రూ.7725,   ఎస్‌ఎంఎస్‌ ఫార్మా రూ.23 (10.41%) పెరిగి రూ.246 వద్ద స్థిరపడ్డాయి. గ్లెన్‌మార్క్‌ ఫార్మా, జేబీ కెమికల్స్, అలెంబిక్‌ ఫార్మా, ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్, మార్క్‌సన్స్‌ ఫార్మా, ఆర్తి డ్రగ్స్‌ షేర్ల ధరలూ ఆకర్షణీయంగా పెరిగాయి. ఫార్మా షేర్లకు ఇదే సానుకూలత కొంతకాలం కొనసాగుతుందని స్టాక్‌మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎంక్యూర్‌ ఫార్మా ఐపీఓ రేపటి నుంచి

అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల్లో ఒకటైన ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 3-5 తేదీల్లో జరగనుంది. రూ.10 ముఖ విలువ కల ఒక్కో షేరును రూ.960- 1108 ధరల శ్రేణిలో జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా సమీకరించనున్న రూ.1,952 కోట్లలో కంపెనీకి రూ.800 కోట్లు సమకూరతాయి. మిగిలిన రూ.1,152 కోట్లు, ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద షేర్లు విక్రయిస్తున్న కంపెనీ ప్రమోటర్లు, యూఎస్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బెయిన్‌ కేపిటల్‌కు లభిస్తాయి. ఎంక్యూర్‌ ఫార్మాకు దేశవ్యాప్తంగా 13 ప్రదేశాల్లో మందులు ఉత్పత్తి చేసే యూనిట్లు ఉన్నాయి. ఫార్మా షేర్లపై మదుపరులకు ఆసక్తి కలగడానికి ఎంక్యూర్‌ ఫార్మా ఐపీఓ కూడా ఒక కారణమని స్టాక్‌మార్కెట్‌ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ ఇష్యూకు లభించే ఆదరణ, షేర్ల నమోదు సమయంలో షేరుకు లభించే ప్రీమియం ఆధారంగా, ఇతర షేర్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని