Demat accounts: జూన్‌లో 42 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు.. మొత్తం ఎన్ని?

Demat accounts: దేశంలో డీమ్యాట్‌ ఖాతాల తెరిచే వారి సంఖ్య పెరుగుతోంది. జూన్‌లో ఈ సంఖ్య మరో 42 లక్షలు పెరిగింది.

Published : 05 Jul 2024 21:12 IST

Demat accounts | ముంబయి: దేశంలో ఈక్విటీ మార్కెట్లు ఊరిస్తున్నాయి. వీటిల్లో పెట్టుబడులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్‌లో కొత్తగా 42 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు జతయ్యాయి. దేశీయ స్టాక్‌మార్కెట్ పట్ల బుల్లిష్‌ ధోరణి కొనసాగుతుండడమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీస్‌ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ డేటా ప్రకారం.. జూన్‌లో 42.4 డీమ్యాట్‌ ఖాతాలు కొత్తగా చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో డీమ్యాట్ ఖాతాలు పెరగడం ఇదే తొలిసారి. గత నెలలో 36 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు ఓపెన్‌ అవ్వగా.. గతేడాది ఇదే నెలలో 23.6 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. ఒక నెలలో 40 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు తెరుచుకోవడం ఇది నాలుగో సందర్భం. 2023 డిసెంబర్‌, 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇదే స్థాయిలో డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో దేశంలో మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు డేటా చెబుతోంది.

కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఈక్విటీ మార్కెట్లలో మదుపర్లలో ఉత్సాహం నెలకొందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మార్కెట్‌ నుంచి మెరుగైన రిటర్నులు వస్తుండడం, ఐపీఓలు క్యూ కడుతుండడం కూడా కారణమని చెబుతున్నారు. ఇటీవల సూచీలు కొత్త గరిష్ఠాలను చేరుతుండడంతో మదుపరుల్లో విశ్వాసాన్ని నింపుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, తెరుచుకున్న అకౌంట్లన్నీ కొత్త ఇన్వెస్టర్లుగా భావించకూడదని, వేరే బ్రోకర్‌ దగ్గర కొత్తగా నమోదయ్యేవీ ఉంటాయని అనలిస్టులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని