Office space leasing: హైదరాబాద్‌లో 40% పెరిగిన కార్యాలయాల అద్దె లావాదేవీలు

అంతర్జాతీయ సంస్థలతో పాటు, దేశీయ కంపెనీలూ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో, హైదరాబాద్‌లో కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరిగింది.

Published : 04 Jul 2024 02:59 IST

కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ సంస్థలతో పాటు, దేశీయ కంపెనీలూ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో, హైదరాబాద్‌లో కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరిగింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో మొత్తం 50 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. గత ఏడాది ఇదే కాలంలో 36 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. దీంతో పోలిస్తే ఈసారి అద్దె లావాదేవీల్లో 40% వృద్ధి కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది. ప్రముఖ సంస్థలు తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్‌ను కీలక స్థానంగా భావిస్తున్నాయని పేర్కొంది.

అందుబాటులో ఉండటమే..: హైదరాబాద్‌లో కార్యాలయ స్థలానికి గిరాకీ పెరిగేందుకు ఇక్కడి మౌలిక వసతులతో పాటు, అనువైన వ్యాపార విధానాలు, స్థిరమైన ప్రభుత్వం లాంటివి తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇక్కడ స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉండటం, నిపుణుల లభ్యతా అనుకూలంగా ఉందని తెలిపింది. దీంతో హైదరాబాద్‌పై పెట్టుబడిదారులు, స్థిరాస్తి డెవలపర్లు, సంస్థలూ సానుకూలంగా ఉంటున్నట్లు వెల్లడించింది.

గ్రేడ్‌ ఏ ప్రాజెక్టులకు..: భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలకు వీలుగా ఉండేలా చూసుకోవడంతో పాటు, ఆధునిక వసతులు, కీలక ప్రాంతాల్లో ఉన్న గ్రేడ్‌ ఏ వాణిజ్య ప్రాజెక్టులకు అధిక గిరాకీ ఉందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో కొత్తగా 27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.

ఐటీ రంగంలోనే..: అత్యధిక లీజింగ్‌ లావాదేవీలు ఐటీ-బీపీఎం రంగంలోనే జరిగాయి. మొత్తం అద్దెకు వెళ్లిన స్థలంలో 36% వరకు ఈ సంస్థలే తీసుకున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థలు 29% స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేస్‌ సంస్థలు 17% స్థలాన్ని తీసుకున్నాయి. వీటితో పాటు కో-లివింగ్‌ లాంటి వాటి కోసమూ అద్దె లావాదేవీలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని