Real Estate: రూ. కోటి ఇళ్లకే అధిక గిరాకీ

భూముల ధరలు, నిర్మాణ ఖర్చు పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా రూ. కోటి, అంతకంటే విలువైన (ప్రీమియం) ఇల్లు/ఫ్లాట్‌ అనేది సాధారణ విషయంగా మారిందని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌టైగర్‌ వెల్లడించింది.

Updated : 19 Jun 2024 08:51 IST

దిల్లీ: భూముల ధరలు, నిర్మాణ ఖర్చు పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా రూ. కోటి, అంతకంటే విలువైన (ప్రీమియం) ఇల్లు/ఫ్లాట్‌ అనేది సాధారణ విషయంగా మారిందని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌టైగర్‌ వెల్లడించింది. విశాలమైన లేఔట్లలో, అధునాతన సౌకర్యాలతో నివాస గృహం ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్యా పెరిగిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి మధ్య అమ్ముడైన 1,20,640 ఇళ్లు/ఫ్లాట్లలో దాదాపు 37% ప్రీమియం విభాగంలోనే ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి మెట్రోపాలిటిన్‌ రీజియన్, పుణే నగరాల్లో రూ.75 లక్షల నుంచి రూ. కోటి పలుకుతున్న ఇళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. 2019లో ప్రీమియం ఇళ్ల విక్రయాలు 16 శాతమే ఉండేవి. దేశ స్థిరాస్తి రంగం వృద్ధి చెందుతుందనేందుకు ప్రీమియం ఇళ్లకు గిరాకీయే నిదర్శనమని  ప్రాప్‌టైగర్‌.కామ్‌ గ్రూపు సీఎఫ్‌ఓ వికాస్‌ వాధ్వాన్‌ తెలిపారు.

గచ్చిబౌలిలో 3% పెరిగిన అద్దె: నివాస గృహాల అద్దె ఏప్రిల్‌-జూన్‌ మధ్య సగటున 2-4% పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ తెలిపింది. 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని 2బీహెచ్‌కే ఇళ్ల అద్దె పెరుగుదల దేశంలోని 7 ప్రధాన నగరాలైన దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి మెట్రోపాలిటిన్‌ రీజియన్, చెన్నై, కోల్‌కతా, పుణే, హైదరాబాద్, బెంగళూరులలో మధ్యస్థాయిలోనే ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో, ఏప్రిల్‌-జూన్‌లో ఇళ్ల అద్దె సగటున 3% పెరిగిందని తెలిపింది. ఇదే ప్రాంతంలో జనవరి-మార్చి మధ్య అద్దెల్లో వృద్ధి సగటున 5% కనిపించింది.

వృద్ధి దశలో విశాఖపట్నం, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి, పర్యటక నగరం విశాఖపట్నంలో స్థిరాస్తి వృద్ధికి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని కొలియర్స్‌ పేర్కొంది. వీటితోపాటు కోయంబత్తూర్, కోచి స్థిరాస్తి రంగానికి ఆసక్తిగా కనిపిస్తున్నాయని తెలిపింది. అయోధ్య, వారణాసి, ద్వారక, పూరి, శిరిడీలాంటి ఆధ్యాత్మిక నగరాలూ వేగంగా వృద్ధి చెందుతున్నాయని పేర్కొంది. దేశ వ్యాప్తంగా మొత్తం 30 నగరాలకు ఈ జాబితాలో సంస్థ స్థానం కల్పించింది. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కలిసొస్తున్నాయని పేర్కొంది. నివాస గృహాలతో పాటు, ఆతిథ్యం, రిటైల్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచీ గిరాకీ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్ని నగరాల్లో డేటా కేంద్రాలవంటివీ వచ్చే వీలుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని