Niva Bupa IPO: ఐపీఓకు నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌.. రూ.3వేల కోట్ల సమీకరణ

Niva Bupa IPO: ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీ నివా బుపా ఐపీఓకు రాబోతోంది. సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది.

Published : 01 Jul 2024 15:28 IST

దిల్లీ: ప్రముఖ బీమా సంస్థ ‘నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌’ ఐపీఓకి (Niva Bupa Health Insurance IPO) రాబోతోంది. ఈమేరకు సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. దాదాపు రూ.3,000 కోట్ల నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.

ప్రతిపాదిత ఐపీఓలో (IPO) రూ.800 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేయాలనుకుంటున్నట్లు నివా బుపా తెలిపింది. మరో రూ.2,200 కోట్ల షేర్లు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు తమ వాటాల నుంచి విక్రయించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇన్వెస్టర్‌ ఫెటిల్‌ టోన్‌ ఎల్‌ఎల్‌పీ రూ.1,880 కోట్లు, ప్రమోటర్‌ బుపా సింగపూర్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ రూ.320 కోట్లు విలువ చేసే షేర్లను ఐపీఓలో (Niva Bupa Health Insurance IPO) ఉంచుతున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ నిర్వహణను ప్రధానంగా యూకే కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కంపెనీ బుపా చేపడుతోంది. ప్రస్తుతం 62.27 శాతం వాటా బుపా సింగపూర్‌ హోల్డింగ్స్‌కు, 27.86 శాతం వాటా ఫెటిల్‌ ఎల్‌ఎల్‌పీకి ఉంది.

రూ.160 కోట్ల విలువైన సెక్యూరిటీలను ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా జారీ చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అదే జరిగితే ఐపీఓ (Niva Bupa Health Insurance IPO) పరిమాణం తగ్గుతుందని పేర్కొంది. సమీకరించిన నిధుల్లో రూ.625 కోట్లు రుణ చెల్లింపుల కోసం కేటాయిస్తామని తెలిపింది. మిగిలిన వాటిని కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగిస్తామని వెల్లడించింది.

దేశీయంగా ఐపీఓకు వస్తున్న రెండో ఆరోగ్య బీమా సంస్థ నివా బుపా. గతంలో ‘స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. దేశంలోని ప్రధాన ఆరోగ్య బీమా కంపెనీల్లో నివా బుపా ఒకటి. 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన ఈ కంపెనీ స్థూల రిటెన్‌ ప్రీమియం 37.68 శాతం పెరిగి రూ.5,607.57 కోట్లకు చేరింది. లాభం రూ.12.54 కోట్ల నుంచి రూ.81.85 కోట్లకు పెరిగింది. 2024 మార్చి 31 నాటికి ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 210 బ్రాంచీలు ఉన్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా కంపెనీ, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, యాక్సిస్‌ క్యాపిటల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు