Today Stock Market: జోరు గుర్రాలు

మార్కెట్ల అప్రతిహత లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. విదేశీ మదుపర్ల పెట్టుబడుల దూకుడు, వచ్చే నెలలో ప్రవేశ పెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌పై సానుకూల అంచనాల కారణంగా గురువారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి సూచీల రికార్డుల మోత మోగింది.

Published : 28 Jun 2024 02:59 IST

సెన్సెక్స్‌ 79,000.. నిఫ్టీ 24,000 పాయింట్లకు
కొత్త శిఖరాలపై దేశీయ మార్కెట్లు
రూ.438.41 లక్షల కోట్లకు మదుపర్ల సంపద

మార్కెట్ల అప్రతిహత లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. విదేశీ మదుపర్ల పెట్టుబడుల దూకుడు, వచ్చే నెలలో ప్రవేశ పెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌పై సానుకూల అంచనాల కారణంగా గురువారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి సూచీల రికార్డుల మోత మోగింది. సెన్సెక్స్‌ తొలిసారి 79,000 పాయింట్ల ఎగువకు చేరగా.. నిఫ్టీ చరిత్రలోనే మొదటిసారిగా 24,000 పాయింట్ల శిఖరాన్ని అందుకుంది. ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్‌ వంటి పెద్ద షేర్లు మార్కెట్ల జోరుకు దోహదపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడి 83.45 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.20% తగ్గి 85.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • 4 రోజుల్లో రూ.3.93 లక్షల కోట్ల లాభం: సూచీల జోరు నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.3.93 లక్షల కోట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన రూ.438.41 లక్షల కోట్ల (5.25 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.
  • సెన్సెక్స్‌ ఉదయం 78,758.67 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది.  79,396.03 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 568.93 పాయింట్ల లాభంతో 79,243.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 175.70 పాయింట్లు పెరిగి 24,044.50 దగ్గర స్థిరపడింది.
  • సెన్సెక్స్‌ సూచీలో అల్ట్రాటెక్‌ 5.07%, ఎన్‌టీపీసీ 3.19%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.59%, టాటా మోటార్స్‌ 2.13%, ఇన్ఫోసిస్‌ 2.09%, టీసీఎస్‌    2.01%, కోటక్‌ బ్యాంక్‌ 1.88%, పవర్‌గ్రిడ్‌ 1.44%, టెక్‌ మహీంద్రా 1.38%, ఎం అండ్‌ ఎం 1.17%, రిలయన్స్‌ 1.11% లాభపడ్డాయి.
  • సెన్సెక్స్‌ ఈ నెల 25న 78000 పాయింట్లను తాకింది. రెండు రోజుల్లోనే 79,000 పాయింట్ల శిఖరాన్ని అందుకుంది.
  • నిఫ్టీ 23000 పాయింట్ల నుంచి 24000 పాయింట్లను కేవలం 23 ట్రేడింగ్‌ రోజుల్లో చేరుకుంది. 
  • మజగావ్‌ షేరు హవా: ఆర్థిక శాఖ నుంచి నవరత్న హోదా అందుకోవడంతో మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ షేరు 8.19% పరుగులు తీసి      రూ.4415.20 వద్ద ముగిసింది. గత ఏడాదికాలంలో షేరు 215% దూసుకెళ్లింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే 74% లాభాలను ఇచ్చింది. 
  • షేర్ల అవకతవకల ఆరోపణలపై కంపెనీ కన్సల్టెంట్‌ సంజీవ్‌ భాసిన్‌పై సెబీ దర్యాప్తు చేస్తుందన్న ఆరోపణలతో ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ షేరు 10.22% నష్టపోయి రూ.205.10 దగ్గర స్థిరపడింది. 
  • అదానీ గ్రూప్‌ నిర్వహణలో ఉన్న గువాహటి లోక్‌ప్రియ గోపినాధ్‌ బోర్‌డోలాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2025 ఏప్రిల్‌కి కొత్త టెర్మినల్‌లోకి మారుతుందని చీఫ్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారి (సీఏఓ) ఉత్పల్‌ బారువా వెల్లడించారు. రూ.2000 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ టెర్మినల్‌ పనులు 2024 డిసెంబరుకు పూర్తికావాల్సి ఉన్నా, ఆలస్యమవుతున్నాయి.
  • దిల్లీ-లండన్‌ మార్గంలో వైడ్‌ బాడీ ఏ350-900 విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. సెప్టెంబరు 1 నుంచి ఈ మార్గంలో రోజుకు రెండు విమానాలను కంపెనీ నడపనుంది. 
  • నమోదుకాని ఆర్థిక ప్రభావశీల వ్యక్తుల (ఫిన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌)ను నియంత్రించేందుకు తీసుకొచ్చిన నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం ఆమోదించింది.

ఐపీఓ సమాచారం

  • వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓ రెండో రోజుకు 16.90 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 61,38,462 షేర్లను ఆఫర్‌ చేయగా, 10,37,65,824 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 19.35 రెట్ల స్పందన వచ్చింది.
  •  బైన్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు ఉన్న ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐపీఓ జులై 3న ప్రారంభమై 5న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ.800 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు.
  • అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ ఐపీఓ ముగిసేసరికి 23.49 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 3,93,71,669 షేర్లను ఆఫర్‌ చేయగా, 92,49,01,092 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 50.37 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 32.35 రెట్లు, రిటైల్‌ విభాగంలో 4.42 రెట్ల స్పందన కనిపించింది. 
  •  అదానీ గ్రూప్‌ నిర్వహణలో ఉన్న గువాహటి లోక్‌ప్రియ గోపినాధ్‌ బోర్‌డోలాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2025 ఏప్రిల్‌ నాటికి కొత్త టెర్మినల్‌లోకి మారుతుందని చీఫ్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారి (సీఏఓ) ఉత్పల్‌ బారువా వెల్లడించారు. రూ.2000 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న నూతన టెర్మినల్‌ పనులు 2024 డిసెంబరులో పూర్తికావాల్సి ఉంది. అయితే డిజైన్‌ మార్పుల వల్ల నాలుగు నెలల  ఆలస్యం కానుంది.
  • దిల్లీ- లండన్‌ మార్గంలో వైడ్‌ బాడీ ఏ350- 900 విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. సెప్టెంబరు 1 నుంచి ఈ మార్గంలో రోజుకు రెండు విమానాలను కంపెనీ నడపనుంది. 
  • నమోదుకాని ఆర్థిక ప్రభావశీల వ్యక్తుల (ఫిన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌)ను నియంత్రించేందుకు తీసుకొచ్చిన నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం ఆమోదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని