CJI: మార్కెట్లు పెరుగుతున్నాయ్‌.. జాగ్రత్త

ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ సూచించారు.

Updated : 05 Jul 2024 06:46 IST

సెబీ, శాట్‌ అప్రమత్తంగా ఉండాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌
మరిన్ని ట్రైబ్యునల్‌ బెంచ్‌లు రావాలన్న సీజేఐ

శాట్‌ కొత్త ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెబీ ఛైర్మన్‌ మాధబి పురి బచ్‌తో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌

ముంబయి: ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ సూచించారు. గురువారమిక్కడ శాట్‌ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిన్ని ట్రైబ్యునల్‌ బెంచ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారీ స్థాయిలో లావాదేవీలు, కొత్త నియంత్రణలు అమల్లోకి రావడంతో పనిభారం పెరిగిందని..ఇందుకనుగుణంగా శాట్‌ కొత్త శాఖలను పెంచాలని తెలిపారు. అదనపు బెంచ్‌ల ఏర్పాటు అనేది విధాన పరమైన నిర్ణయమని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘సెన్సెక్స్‌ 80,000 పాయింట్లను అధిగమించింది. ఇంత అధికస్థాయుల్లో మార్కెట్లు ఉన్నప్పుడు, నియంత్రణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. స్టాక్‌ మార్కెట్‌ దూసుకెళ్తున్నప్పుడు సెబీ, శాట్‌ల పాత్ర మరింత పెరుగుతూ వస్తుందని నేను భావిస్తా. ప్రతి ఒక్కరు భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని, ట్రేడింగ్‌ చేయాలి. భారీ లాభాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సెబీ, శాట్‌ వంటివి దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా స్థిర పెట్టుబడుల వాతావరణాన్ని సృష్టించాలి. తమ పెట్టుబడులు భద్రంగా ఉంటాయని మదుపర్లు భావించేలా చేయాలి. వివాదాల పరిష్కారాలకు సరైన వ్యవస్థలను నెలకొల్పాలి. సంబంధిత వ్యవస్థలన్నీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేలా శాట్‌ తన పాత్ర పోషించాలి. మార్కెట్లో మదుపర్ల సంఖ్య, లావాదేవీల సంఖ్య పెరిగే కొద్దీ వివాదాలు పెరిగేందుకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశాలు ఉంటాయి. కార్పొరేట్‌ పాలన విషయంలో శాట్‌ వద్దకు వచ్చే పిటిషన్లూ భారీ స్థాయిలో పెరిగాయి’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని