Patanjali Foods: పతంజలి ఫుడ్స్‌ చేతికి మరిన్ని వ్యాపారాలు

పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు  వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్‌ ప్రకటించింది.

Published : 02 Jul 2024 01:55 IST

రూ.1,100 కోట్లకు విక్రయించనున్న పతంజలి ఆయుర్వేద్‌

దిల్లీ: పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు  వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్‌ ప్రకటించింది. పూర్తిస్థాయి ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీగా మారే చర్యల్లో భాగంగా, ఈ కొనుగోలును పతంజలి ఫుడ్స్‌ చేపడుతోంది. పతంజలి ఫుడ్స్‌ ప్రమోటర్లలో పతంజలి ఆయుర్వేద్‌ కూడా ఒకటి. ఆహారేతర వ్యాపారాన్నంతటినీ.. అంటే కేశ - చర్మ - దంత - గృహ సంరక్షణ విభాగాల కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపిందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పతంజలి ఫుడ్స్‌ సమాచారం అందింది. ఇందుకోసం దశల వారీగా రూ.1100 కోట్ల చెల్లింపు ఉంటుందని, అంతర్గత నగదు నిల్వలను ఇందుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. తాజా లావాదేవీకి వాటాదార్లు, రుణదాతల ఆమోదంతో పాటు ఇతర అనుమతులు దక్కాల్సి ఉంది. కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) ఆమోదమూ పొందాలి. ప్రస్తుత త్రైమాసికంలో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుందని పతంజలి ఫుడ్స్‌ సీఈఓ సంజీవ్‌ ఆస్తానా అంచనా వేశారు. ‘దంత్‌కాంతి’, ‘కేశ్‌ కాంతి’ వంటి బ్రాండ్లను పొందనున్నట్లు తెలిపారు. 

ట్రేడ్‌మార్క్‌ల వినియోగం..: ప్రస్తుతం పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ వ్యాపారం బలమైన బ్రాండ్‌ ఈక్విటీని కలిగి ఉంది. లైసెన్సింగ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడానికి పతంజలి ఫుడ్స్, పతంజలి ఆయుర్వేద్‌ అంగీకరించాయి. దీంతో ట్రేడ్‌మార్క్‌లను, సంబంధిత మేధోపర హక్కులు పతంజలి ఫుడ్స్‌ వినియోగించుకోవచ్చు. బోర్డు అనుమతి నేపథ్యంలో ఈ కొనుగోలుకు సంబంధించి, కచ్చితంగా అమలు చేయాల్సిన ఒప్పందాల పూర్తికి అవసరమైన చర్యలను పతంజలి ఫుడ్స్‌ తీసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని