MIPPL: అయిదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు

నిర్మాణ రంగంలో వినియోగించే మైల్డ్‌ స్టీల్‌(ఎంఎస్‌)ను ఉత్పత్తి చేసే మారుతీ ఇస్పాత్‌ అండ్‌ పైప్స్‌(ఎంఐపీపీఎల్‌) రానున్న అయిదేళ్లలో దశల వారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది.

Published : 26 Jun 2024 02:18 IST

మంత్రాలయం ప్లాంటును విస్తరించనున్న ఎంఐపీపీఎల్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలో వినియోగించే మైల్డ్‌ స్టీల్‌(ఎంఎస్‌)ను ఉత్పత్తి చేసే మారుతీ ఇస్పాత్‌ అండ్‌ పైప్స్‌(ఎంఐపీపీఎల్‌) రానున్న అయిదేళ్లలో దశల వారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా మంత్రాలయంలో 300 ఎకరాల్లో ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని విస్తరించడంతోపాటు; ఘజియాబాద్, ఒడిశా లేదా ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ సీఈఓ అభిషేక్‌ అగర్వాల్‌ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఆఫ్రికాలోనూ ఒక ప్లాంటును ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రాలయంలో ఉన్న ప్లాంటు కోసం అదనంగా మరో 300 ఎకరాలు కొనుగోలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ 1.80 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి 2.86 లక్షల టన్నులకు చేరుతుందని పేర్కొన్నారు. అయిదేళ్లలో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 6 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. సంస్థకు ప్రస్తుతం 2,000 మంది ఉద్యోగులున్నారని, విస్తరణ కార్యకలాపాలు పూర్తయ్యే నాటికి కొత్తగా మరో 10,000 మందిని చేర్చుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ద్వారా రూ.400 కోట్ల మేరకు సమీకరించి, ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. కొత్తగా ఎంఎస్‌ వాయు పేరుతో ఉత్పత్తిని ప్రవేశపెట్టినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని