Microsoft layoffs: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత

Microsoft layoffs: మైక్రోసాఫ్ట్‌ కంపెనీ మరోసారి ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. ఎంతమందిని తొలగించిందీ వెల్లడి కాలేదు.

Published : 05 Jul 2024 00:07 IST

Microsoft layoffs | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తోన్న వివిధ టీమ్‌లకు చెందిన వారిని తాజా రౌండ్‌లో తొలగించినట్లు గ్రీక్‌వైర్‌ అనే మీడియా సంస్థ తెలిపింది. ఎంతమందిని తొలగించిందీ వెల్లడి కాలేదు. తొలగింపులకు గురైన ఉద్యోగులు లింక్డిన్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీనిబట్టి ప్రొడక్ట్‌, ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఈ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది.

తాజా తొలగింపులపై మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తిలో మార్పులు సర్వసాధారణమని పేర్కొన్నారు. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలందించడంతో పాటు వృద్ధికి ఆస్కారం ఉన్న విభాగాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. జూన్‌ 30తో ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టడం గమనార్హం.

మైక్రోసాఫ్ట్‌ తొలగింపులు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో గేమింగ్‌ డివిజన్‌లో 2వేల మందిని తొలగించింది. ఇటీవల అజ్యూర్‌, మిక్స్‌డ్‌ రియాలిటీ విభాగానికి చెందిన వెయ్యి మందిని గత నెలలో తొలగించింది. తాజా తొలగింపులు అందుకు అదనం. గతేడాదిలో మైక్రోసాఫ్ట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది ఇప్పటివరకు లక్ష మంది టెక్‌ ఉద్యోగులకు పలు టెక్‌ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించినట్లు Layoffs.fyi వెబ్‌సైట్‌ డేటా చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని