Meta AI: భారత్‌లోకి ‘మెటా ఏఐ’.. వాట్సప్‌, ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో ఏఐ అసిస్టెంట్‌

Meta AI: ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో యూజర్లకు చేదోడుగా ఉండేలా మెటా.. ‘ఏఐ అసిస్టెంట్‌’ను రూపొందించింది. ‘మెటా ఏఐ’ పేరిట తీసుకొచ్చిన దీన్ని తాజాగా భారత్‌లో విడుదల చేసింది.

Published : 24 Jun 2024 11:32 IST

దిల్లీ: బిలియనీర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని టెక్‌ సంస్థ మెటా రూపొందించిన ఏఐ అసిస్టెంట్‌ ‘మెటా ఏఐ’ (Meta AI) భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా మెటా.ఏఐ పోర్టల్‌లో దీన్ని ఉపయోగించుకోవచ్చని సోమవారం వెల్లడించింది.

యూజర్లు ఇకపై మెటా ఏఐ (Meta AI)ని సామాజిక మాధ్యమ యాప్‌లలో చాటింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌ సహా ఆయా టాపిక్‌లపై లోతుగా శోధించేందుకు ఉపయోగించుకోవచ్చు. యాప్‌లను వీడకుండానే కావాల్సిన పనిని పూర్తి చేయొచ్చు. మెటా రూపొందించిన లామా3 ఎల్‌ఎల్‌ఎం ఆధారిత ఏఐ అసిస్టెంట్‌ను భారత యూజర్లకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది.

మెటా ఏఐ (Meta AI) సాయంతో వాట్సప్‌ గ్రూప్‌ చాట్‌లో దగ్గర్లోని రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు కాసేపు విడిది కోసం ఎక్కడ ఆగొచ్చో ఆరా తీయొచ్చు. వెబ్‌లో మల్టిపుల్‌ ఛాయిస్‌ టెస్ట్‌ను క్రియేట్‌ చేయమని కూడా మెటా ఏఐని కోరవచ్చు. ఇలా యూజర్లకు పలు రకాలుగా ఈ ఏఐ అసిస్టెంట్ అండగా ఉంటుంది.

ఫేస్‌బుక్‌ వాడుతున్నప్పుడు మీకు కావాల్సిన ఫీడ్‌ను వెతికిపెట్టడంలో మెటా ఏఐ సాయంగా ఉంటుంది. ఓ పోస్ట్‌పై లోతైన సమాచారం తెలుసుకునేందుకూ వాడుకోవచ్చు. ఏదైనా పర్యటక స్థలం చిత్రం ఎఫ్‌బీలో కనిపించినప్పుడు.. అక్కడికి వెళ్లడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఏఐ అసిస్టెంట్‌ను అడిగితే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని