Medical Emergency Loans: చికిత్స కోసం అప్పు చేస్తున్నారా?

ఆరోగ్య అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలోనైనా రావచ్చు. దీనికి ఆర్థికంగా అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. ఆరోగ్య బీమా ఉన్నప్పుడు కొంత భరోసాగా ఉంటుంది.

Published : 28 Jun 2024 01:05 IST

ఆరోగ్య అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలోనైనా రావచ్చు. దీనికి ఆర్థికంగా అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. ఆరోగ్య బీమా ఉన్నప్పుడు కొంత భరోసాగా ఉంటుంది. దీనికి మించి ఖర్చు అయినప్పుడు చేతిలో డబ్బు లేకపోతే ఇబ్బందే. ఇలాంటప్పుడు అప్పు చేయక తప్పకపోవచ్చు. ఇప్పుడు చాలా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చికిత్స కోసం ‘మెడికల్‌ ఎమర్జెన్సీ లోన్స్‌’ఇస్తున్నాయి. వీటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

అత్యవసర చికిత్స ఖర్చులను తట్టుకునేందుకు ఈ రుణాలను తీసుకోవచ్చు. సాధారణ వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇవి చాలా వేగంగా మంజూరవుతాయి. అర్హత, ఇతర నిబంధనల విషయంలోనూ కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లూ కాస్త తక్కువే. ఆసుపత్రిలో చేరడం, శస్త్రచికిత్సలు, మందుల ఖర్చులు, ఇలా అనేక రకాల వైద్య అవసరాల కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. 
చికిత్స సందర్భంలో ఆర్థిక అవసరాల కోసం మెడికల్‌ రుణాలతోపాటు వ్యక్తిగత రుణం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రుణం, క్రెడిట్‌ కార్డు, బంగారంపై అప్పు, ఈపీఎఫ్‌ నుంచి అడ్వాన్స్‌లాంటివి పరిశీలించవచ్చు. 

  • ప్రస్తుతం అనేక బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, డిజిటల్‌ రుణ సంస్థలూ ప్రత్యేక వైద్య రుణాలను అందిస్తున్నాయి. ఆసుపత్రులతోనూ కొన్ని సంస్థలు ఒప్పందాలు చేసుకొని, అక్కడ చికిత్స తీసుకుంటున్న వారికి వేగంగా రుణాలను అందిస్తున్నాయి. అత్యవసర సందర్భం వచ్చినప్పుడు ఏ సంస్థ నుంచి రుణం తీసుకోవాలి అనే విషయంపై పెద్దగా దృష్టి పెట్టం. కానీ, కొద్దిగా ఆలోచించి, సరైన సంస్థను ఎంచుకోవడం ముఖ్యం. 
  • రుణం తీసుకునేందుకు ప్రాథమికంగా కొన్ని పత్రాలు అవసరం. గుర్తింపు, చిరునామా ధ్రువీకరణలు, ఆదాయ వివరాలు, చికిత్సకు 
  • సంబంధించిన అంచనాల్లాంటివి కావాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా రుణానికి దరఖాస్తు చేయొచ్చు.
  • చాలా సంస్థలు మెడికల్‌ లోన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలును కల్పిస్తున్నాయి. దీనివల్ల మీ సమయం వృథా కాదు. తొందరగా రుణం వచ్చేందుకు వీలవుతుంది.
  • బ్యాంకులు/ఆర్థిక సంస్థలు వ్యక్తిగత, ఆరోగ్య రుణాలను ముందుగానే ఆమోదించి, కావాల్సినప్పుడు తీసుకునేందుకు వీలు కల్పిస్తాయి. మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోండి. ఇలాంటి ఆఫర్లు ఉంటే, వేగంగా మీ రుణ దరఖాస్తు ఆమోదం పొందుతుంది. 
  • ఫిన్‌టెక్‌ కంపెనీలు త్వరగా రుణాలను అందిస్తాయి. కానీ, వీటిని ఎంపిక చేసుకునేప్పుడు కచ్చితంగా ఆర్‌బీఐ నుంచి అనుమతి ఉందా లేదా చూసుకోవాలి. మోసపూరిత యాప్‌ల నుంచి రుణాలు తీసుకుంటే అధిక వడ్డీలతో వేధిస్తాయి. 
  • రుణదాతలు మీ క్రెడిట్‌ స్కోరును పరిశీలించాకే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి, ఎప్పుడూ క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసుకోవడం అవసరం. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని