Adani Hindenburg Row: ‘అదానీ’పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్‌ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!

Adani Hindenburg Row: అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిందంటూ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వెనక చైనా హస్తం ఉందని ప్రముఖ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ ఆరోపించారు.

Published : 05 Jul 2024 11:10 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌, హిండెన్‌బర్గ్‌ వివాదంపై (Adani Hindenburg Row) ప్రముఖ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక చైనా వర్గాల హస్తం ఉందని ఆరోపించారు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మార్క్‌ కింగ్‌డన్‌.. అదానీ గ్రూప్‌పై (Adani Group) నివేదికను సిద్ధం చేసేందుకు హిండెన్‌బర్గ్‌ను నియమించుకున్నారని తెలిపారు. అదే సమయంలో అదానీ షేర్లలో ట్రేడ్‌ చేసేందుకు కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ను కూడా సంప్రదించారని ఆరోపించారు.

హిండెన్‌బర్గ్‌కు (Hindenburg) భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ గతవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్‌’ జరిపిందని ఆరోపణలు చేసింది. నివేదిక విడుదలకు ముందే కింగ్‌డన్‌తో హిండెన్‌బర్గ్‌ అనుబంధం మొదలైందని అందులో పేర్కొంది. తద్వారా అదానీ కంపెనీల షేర్లలో షార్ట్‌ పొజిషన్లు తీసుకుని.. నివేదిక విడుదల చేశాక వాటిని వదిలించుకోవడం ద్వారా కింగ్‌డన్‌ సొమ్ముచేసుకున్నారని  ఆరోపించింది. ఇది హిండెన్‌బర్గ్‌, కింగ్‌డన్‌ కుట్రలో భాగమని పేర్కొంది.

ఈ పరిణామాల ఆధారంగా మహేశ్‌ జెఠ్మలానీ తాజాగా ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. అది ఆయన వాక్యాల్లోనే..

  • హిండెన్‌బర్గ్‌ను అదానీ గ్రూప్‌పై నివేదికను రూపొందించడానికి అమెరికన్ వ్యాపారవేత్త మార్క్‌ కింగ్‌డన్‌ నియమించారు.
  • అదానీ షేర్లలో ట్రేడింగ్‌ కోసం ఆఫ్‌షోర్ ఫండ్, ఆఫ్‌షోర్ ఖాతాల ఏర్పాటుకు కోటక్‌ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్‌ (KMIL)ని కింగ్‌డన్‌ సంప్రదించారు. అలా కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ (KIOF) ఉనికిలోకి వచ్చింది.
  • హిండెన్‌బర్గ్ నివేదిక తయారీకి ముందే మారిషస్ మార్గంలో అదానీ షేర్లలో KIOF పెద్ద షార్ట్ పొజిషన్‌లను తీసుకుంది. దీని కోసం ‘కింగ్‌డన్ మాస్టర్ ఫండ్’ నిధులు అందించింది. ఈ ఫండ్‌లో కింగ్‌డన్‌ భార్య అన్లాచెంగ్‌తో సహా ఆయన కుటుంబానికి గణనీయ వాటాలున్నాయి.
  • అన్లా చెంగ్ ఒక చైనీస్ అమెరికన్. అమెరికాలో చైనీస్ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. ఆమె ‘SupChina’, చైనా ప్రాజెక్ట్‌ అనే చైనా అనుకూల మీడియా సంస్థలను నిర్వహించారు. వీటికి అక్కడి కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధం ఉందని ఆరోపణలు రావటంతో అవి మూతపడ్డాయి.

అంటూ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) వెనక చైనా వర్గాల హస్తం ఉందని జెఠ్మలానీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక రూపకల్పనలో సహకరించిన భారత ఆర్థిక సంస్థలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు చైనా మూలాల గురించి ముందే తెలుసా? అని ప్రశ్నించారు. షార్ట్‌ ట్రేడింగ్‌ వల్ల వారు కూడా లబ్ధిపొందారా? అని నిలదీశారు. అసలు కేఎంఐఎల్‌ను కింగ్‌డన్‌కు ఎవరు పరిచయం చేశారని ప్రశ్నించారు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సెబీని కోరారు.

కింగ్‌డన్‌ షార్ట్‌ పొజిషన్ల గురించి తమకు సమాచారం లేదని సెబీ నోటీసుల తర్వాత హిండెన్‌బర్గ్‌ తన వివరణలో తెలిపింది. అలాగే తమ నివేదికను ఈమెయిల్‌ ద్వారా బహిర్గతం చేయడానికి ముందు కింగ్‌డన్‌కు అందజేయలేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని