LG Electronics IPO: ఐపీఓకు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా సన్నాహాలు!

LG Electronics IPO: . టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు సహా గృహోపకరణాలు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో తనదైన ముద్ర వేసిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా త్వరలో ఐపీఓకు వచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Updated : 27 Jun 2024 15:41 IST

LG Electronics IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఎల్‌జీ తమ భారత అనుబంధ సంస్థను పబ్లిక్‌ ఇష్యూ (LG Electronics India IPO) ద్వారా తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈమేరకు సన్నాహాలు ప్రారంభించినట్లు ఆ దేశ ప్రముఖ వాణిజ్య పత్రిక ఇన్వెస్ట్‌ చొసున్‌ ఇటీవల వెల్లడించింది. భారత్‌లో గృహోపకరణాల విభాగంలో బలమైన అమ్మకాలు నమోదవుతున్న నేపథ్యంలో దాన్ని నిధుల సమీకరణకు ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

ఐపీఓ (IPO) నిమిత్తం ఇప్పటికే ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ (LGEIL) ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌ సహా స్థానిక నియంత్రణ సంస్థలను కంపెనీ వర్గాలు సంప్రదించినట్లు పేర్కొంటూ ఇన్వెస్ట్‌ చొసున్‌ తన కథనంలో వెల్లడించింది. జేపీ మోర్గాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఈ ఐపీఓ నిర్వహణలో భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సియోల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎల్‌జీ.. దక్షిణ కొరియాకు చెందిన అతిపెద్ద బహుళజాతి సంస్థల్లో ఒకటి. టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు సహా గృహోపకరణాలు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో తనదైన ముద్ర వేసింది. త్వరలో భారత్‌లో ఐపీఓకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ప్రతినిధిని నియమించనున్నట్లు సమాచారం.

ఎల్‌జీఈఐఎల్‌ ఐపీఓ కోసం ఎల్‌జీ 2000 సంవత్సరంలోనే ప్రయత్నాలు చేసింది. కానీ, అప్పటి మార్కెట్‌ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనక్కి తగ్గింది. ఫ్యాక్టరీల స్థాపన, డీలర్‌షిప్‌ల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇప్పుడు చేసే ప్రయత్నాలు గనక కార్యరూపం దాల్చితే ఐపీఓ ద్వారా ఎల్‌జీఈఐఎల్‌ రూ.4,200 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని