Jio OTT plans: ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!

Jio OTT plans: జియో సంస్థ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.

Published : 06 Jul 2024 00:03 IST

Jio OTT plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో (Jio) ఇటీవల తన మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల ధరలను 12-27 శాతం మేర పెంచేసింది. అందుకు అనుగుణంగా జులై 3 నుంచి ప్లాన్లను సవరించి కొత్తవాటిని అందుబాటులోకి తెచ్చింది. ఓటీటీ ప్రయోజనాలతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్లనూ సవరించింది. ఈ క్రమంలో కొన్ని ప్లాన్లను పూర్తిగా తొలగించింది. గతంలో 21 ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్లు ఉండగా.. ఇప్పుడు వాటిని ఏడుకు కుదించింది.

టారిఫ్‌ల సవరణకు ముందు జియో సంస్థ.. సోనీ లివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో (2.5జీబీ) రూ.3662 ప్లాన్; ఒక్క సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3226 (2 జీబీ) ప్లాన్‌; కేవలం జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3225 (2జీబీ) ప్లాన్‌; ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3227 (2జీబీ) ప్లాన్‌, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3178 (2జీబీ) వంటి వార్షిక ప్లాన్లను అందించేది. వీటితో పాటు ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌ వంటి 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన రూ.4498 లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ను అందించేది. ఇందులో లాంగ్‌టర్మ్‌ ప్లాన్లన్నింటినీ జియో ఇప్పుడు తొలగించింది. భవిష్యత్‌లో కొత్త ధరలతో వీటిని తీసుకొస్తుందేమో చూడాలి.

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్ల విభాగంలో కేవలం ఏడే ప్లాన్లు అందుబాటులోఉన్నాయి. అందులో సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌ వంటి 12 రకాల ఓటీటీ ప్రయోజనాలతో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ఉంది. దీని ధర రూ.175. ఇది కేవలం డేటా ప్లాన్‌ మాత్రమే. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 84 రోజులకు రోజుకు 2 జీబీ డేటాతో రూ.1299 ప్లాన్‌ ఒకటి కాగా.. 3జీబీ ప్లాన్‌ ధర రూ.1799కి జియో అందిస్తోంది. ఇదే వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా ప్రయోజనంతో రూ.1029కి ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో మరో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది.

ఫ్యాన్‌కోడ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో 2.5జీబీ వ్యాలిడిటీతో రూ.3999కి ఓ దీర్ఘకాలిక ప్లాన్‌ను జియో అందుబాటులో ఉంచింది. ఇది కాకుండా మ్యూజిక్‌ను ఆస్వాదించేవారికి జియో సావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో రూ.889, రూ.329 ప్లాన్లను జియో అందిస్తోంది. ఇందులో ఒకటి 84 రోజుల ప్లాన్‌ కాగా.. ఇంకోటి 28 రోజుల ప్లాన్‌. ఈ రెండు ప్లాన్లూ రోజుకు 1.5జీబీ డేటాతో వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని