Jio-Airtel: జియో, ఎయిర్‌టెల్‌ కొత్త టారిఫ్‌లు.. వార్షిక రీఛార్జికి ‘ప్లాన్‌’ చేస్తున్నారా?

Jio-Airtel: జియో, ఎయిర్‌టెల్ తమ ప్లాన్‌ ధరలను సవరిస్తున్నాయి. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

Updated : 01 Jul 2024 20:17 IST

Jio-Airtel | ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలికాం కంపెనీలైన జియో (Jio), ఎయిర్‌టెల్‌ (Airtel) మొబైల్‌ ప్లాన్‌ ధరలను సవరించాయి. పెరిగిన ధరలు జులై 3 నుంచి అంటే.. జులై 2 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈలోపు రీఛార్జి చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి. కొత్త ధరలు అమల్లోకి రాకమునుపే వార్షిక ప్లాన్‌ రీఛార్జి చేసుకుంటే సుమారు రూ.600 మేర ఆదా చేసుకోవచ్చు. మూడు నెలలకు రీఛార్జి చేసినా రూ.130 మేర ఆదా అవుతుంది.

జియో వార్షిక ప్లాన్‌లు

జియో రూ.2999కే వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. జులై 3 నుంచి ఈ ప్లాన్‌ ధర రూ.3599కి పెరగనుంది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. జియోలో ప్రస్తుత ప్లాన్‌ యాక్టివేట్‌లో ఉన్నా మరో రీఛార్జి చేసుకుంటే.. ఆ ప్లాన్‌ గడువు ముగియగానే తర్వాతి ప్లాన్‌ ఆటోమేటిక్‌గా యాక్టివేట్‌ అవుతుంది. అంతవరకు ఈ ప్లాన్‌ క్యూలో ఉంటుంది. నిర్దేశిత గడువులోగా రీఛార్జి చేసుకున్నారు కాబట్టి పాత ఛార్జీలే వర్తిస్తాయి. 

దీంతో పాటు సోనీలివ్‌+ జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3662 ప్లాన్‌ (రోజుకు 2.5 జీబీ), ఫ్యాన్‌కోడ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3333 (2.5జీబీ), కేవలం సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3226 (2 జీబీ), కేవలం జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3225 (2జీబీ), ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3227 (2జీబీ), డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3178 (2జీబీ) వార్షిక ప్లాన్‌లను జియో అందిస్తోంది. ఇవి కాకుండా ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌ వంటి 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన రూ.4498 ప్లాన్‌ కూడా జియో ప్రీపెయిడ్‌లో అందుబాటులో ఉంది.

జియో vs ఎయిర్‌టెల్‌ vs వొడాఫోన్‌ ఐడియా.. పాపులర్‌ ప్లాన్ల లేటెస్ట్‌ ధరలు ఇవే..

ఎయిర్‌టెల్‌ వార్షిక ప్లాన్‌లు

ఎయిర్‌టెల్‌ రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌తో జియో తరహాలోనే రూ.2999కే వార్షిక ప్లాన్‌ అందిస్తోంది. జులై 3 తర్వాత ఈ ప్లాన్‌ ధర రూ.3,599కి చేరనుంది. ఇది కాకుండా రోజుకు 2.5 జీబీ డేటా, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలతో రూ.3359 వార్షిక ప్లాన్‌ అందిస్తోంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కోరుకునే వారి కోసం రూ.1799 ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో ఏడాది మొత్తానికీ 24జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు. అయితే, ఎయిర్‌టెల్‌లో యాక్టివ్‌ ప్లాన్‌ అందుబాటులో ఉండగా.. మరోప్లాన్‌ రీఛార్జి చేసుకుంటే తక్షణమే ఆ ప్లాన్‌ యాక్టివేట్‌ అవుతుంది. పాత ప్లాన్‌నే మళ్లీ రీఛార్జి చేసుకున్నప్పుడు మాత్రమే క్యూలో ఉంటోందని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు.

వొడాఫోన్‌ ఐడియా ప్లాన్స్ 

వొడాఫోన్‌ ఐడియాలోనూ 365 రోజులకు రూ.1799 ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఇందులో మొత్తంగా 24 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటాతో రూ.2899 ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. వీటితో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.3099... 850జీబీ డేటాతో రూ.2999 ప్లాన్లను వొడాఫోన్‌ ఐడియా అందిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రోజుకు 2జీబీ డేటాతో రూ.3199 ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. జులై 4 నుంచి వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్‌ ధరలు అమల్లోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు