emergency fund: అత్యవసరంలో ఆదుకునేలా

అత్యవసరం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఈ పరిస్థితికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సిన పని. ముఖ్యంగా ఆర్థిక అత్యవసరాలు కొన్నిసార్లు మానసికంగా ఆందోళనను కలిగిస్తాయి.

Published : 21 Jun 2024 00:25 IST

అత్యవసరం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఈ పరిస్థితికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సిన పని. ముఖ్యంగా ఆర్థిక అత్యవసరాలు కొన్నిసార్లు మానసికంగా ఆందోళనను కలిగిస్తాయి. ఇలాంటివి ఎదురవ్వకుండా కొంత అత్యవసర నిధి ఎప్పుడూ మన చేతిలో ఉండేలా చూసుకోవడమే మేలు.

త్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించాలి. రెండు మూడు నెలలపాటు ఖర్చులకు ఇబ్బంది లేకుండా కొంత మొత్తం అందుబాటులో ఉండాలి. ఇది ప్రధానంగా నిత్యావసరాలు, బిల్లులు, రుణ వాయిదాలు, ఇంటి అద్దెలాంటి అవసరాలు తీర్చాలి. రెండో రకం.. దీర్ఘకాలిక అవసరాలకు సరిపోయే మొత్తాన్ని జమ చేయడం. కనీసం ఏడాది పాటు ఎలాంటి ఆదాయం లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేలా దీన్ని నిర్ణయించుకోవాలి. ఇది చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. దీన్ని జమ చేయడం కష్టం కూడా. కానీ, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటే అసాధ్యమేమీ కాదు.

ఎందుకు ఉండాలంటే..

అత్యవసర నిధి ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కష్టకాలంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక సవాళ్లను స్వీకరించడంలో మీకు విశ్వాసాన్ని ఇస్తుంది. అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా ఆదాయం తగ్గినప్పుడు ఖర్చుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. చేతిలో డబ్బు లేకపోతే స్నేహితులు, కుటుంబ సభ్యులు, బ్యాంకుల నుంచి అప్పు చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు వడ్డీ భారంతోపాటు కొన్ని సందర్భాల్లో స్నేహితులతో సంబంధాలు దెబ్బతినే ఆస్కారమూ ఉంటుంది. డబ్బు 
గురించిన చింత లేకపోతే మీరు ఇతర అంశాలపై దృష్టి సారించేందుకు వీలవుతుంది.

ఎంత అవసరం?: కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు అన్ని రకాల ఖర్చులకూ సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. ఇందులో రుణవాయిదాలు, బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులాంటివీ ఉండాలి.
ఒకేసారి కాకుండా: అవసరమైన మొత్తాన్ని ఒకేసారి సాధించాలనుకోవడం కష్టమే. నెలకు వీలైనంత మొత్తాన్ని దాచుకుంటూ వెళ్లాలి. కొన్ని నెలలపాటు ఖర్చులను నియంత్రణలో పెట్టాలి. వినోదంలాంటి అత్యవసరం కాని వాటికి దూరంగా ఉండాలి. దీనివల్ల పొదుపు మొత్తం పెరుగుతుంది.
బడ్జెట్‌తో: ఆదాయం, ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి. దీనివల్ల వృథా ఖర్చులు తగ్గుతాయి. వాస్తవ వ్యయాలపైనా ఒక అంచనాకు వచ్చేందుకు వీలవుతుంది. అప్పుడు ఎంత మేరకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవచ్చో తెలుస్తుంది.

  • నష్టభయం తక్కువగా ఉండే రికరింగ్‌ డిపాజిట్‌లాంటి వాటిని ప్రారంభించి, అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలి. ఒకసారి అనుకున్న మొత్తం సాధించాక.. వెంటనే నగదుగా మార్చుకునేందుకు వీలున్న పథకాల్లోకి మళ్లించాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని