Isha Ambani: ‘ఐవీఎఫ్‌తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ

రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నడిపిస్తోన్న ఈశా అంబానీ(Isha Ambani).. తన కవలలకు ఐవీఎఫ్(IVF) పద్ధతిలో జన్మనిచ్చినట్లు తెలిపారు. 

Updated : 29 Jun 2024 17:38 IST

ముంబయి: అపర కుబేరుడైన ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) తనయగా, యువ వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఈశా అంబానీ పిరమాల్ (Isha Ambani).. తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఐవీఎఫ్(IVF) పద్ధతిలో తాను కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. తాజాగా ఆమె ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ వోగ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘నేను ఐవీఎఫ్‌తో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని చాలా త్వరగా బయటపెడుతున్నాను. అంతా ఈ పద్ధతిని సాధారణంగా భావించాలనే ఉద్దేశంతో దీనిని వెల్లడిస్తున్నాను. దీనిగురించి ఎవరూ సిగ్గుపడాల్సిన పని లేదు. అయితే ఐవీఎఫ్‌ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆ చికిత్స తీసుకుంటున్నప్పుడు శారీరకంగా చాలా అలసిపోతారు. మనకు ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు.. సంతానం కోసం దానిని ఎందుకు ఉపయోగించుకోకూడదు. అది మీరు సంతోషపడాల్సిన అంశం. దాచే విషయం కాదు. దీనిగురించి మీరు ఇతర మహిళలతో మాట్లాడితే.. ఈ ప్రక్రియ సులభంగా అనిపించొచ్చు’’ అని ఈశా అభిప్రాయపడ్డారు.  ఈశా, ఆనంద్‌ పిరమాల్‌కు 2018లో వివాహం జరిగింది. ఆమె 2022లో ఆద్యశక్తి, కృష్ణలకు జన్మనిచ్చారు.

Anant Ambani Wedding: అనంత్‌ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో సామూహిక వివాహాలు

ఆమె తల్లి, ముకేశ్‌ సతీమణి నీతా అంబానీ కూడా ఈశా, ఆకాశ్‌కు జన్మనిచ్చేందుకు ఈ ఐవీఏఫ్‌నే ఆశ్రయించారు. దీనిగురించి ఓ సందర్భంలో ఆమె వెల్లడించారు. ‘‘నేను గర్భం దాల్చలేనని వైద్యులు చెప్పినప్పుడు ఎంతో వేదనకు గురయ్యా. అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. అయితే, నా డాక్టర్ స్నేహితురాలు నాకు ఆ బాధను తొలగించింది. ఐవీఎఫ్ వల్ల నేను కవలలకు జన్మనిచ్చా’’ అని నీతా తెలిపారు. ఈ ఐవీఎఫ్‌ క్లిష్టమైన ప్రక్రియే అయినప్పటికీ.. ఇది ఎన్నో జంటల్లో ఆనందాన్ని నింపుతోందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఈశా ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం గ్రేట్‌ అని, అదేమీ మచ్చ కాదని అన్నారు.

ఐవీఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌)నే.. టెస్ట్‌ట్యూబ్‌ బేబీ విధానం అంటారు. ఇందులో ఆడవారి నుంచి పక్వమైన అండాలను బయటకు తీసి, ప్రయోగశాలలో ఒక పాత్రలో పెట్టి, మగవారి వీర్య కణాలతో ఫలదీకరణ చెందిస్తారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు, మూడింటిని ఆడవారి గర్భంలో ప్రవేశపెడతారు. అవి అక్కడ కుదురుకొని పెరగటం మొదలెడతాయి. ఈ పద్ధతిలో సాధారణంగా ట్విన్స్‌కు జన్మనిచ్చే రేటు పది శాతం ఉంటుంది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది.

స్నేహితురాలే ఇంటి సభ్యురాలైంది

ఈ సందర్భంగా ఈశా.. శ్లోకా అంబానీ, రాధికా మర్చంట్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ‘‘నా సోదరుడు ఆకాశ్‌ అంబానీ శ్లోకను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఎంతో సంతోషించా. ఆమె ప్రియమైన స్నేహితురాలు కావడమే అందుకు కారణం. ఎదిగేకొద్దీ మా బంధం బలపడింది. ఇప్పుడు కూడా మేం లండన్‌లో ఒకే ఇంట్లో ఉంటాం. పిల్లలతో మేం అక్కడ ఉంటే.. ఆకాశ్‌, ఆనంద్ పిరమాల్ ముంబయిలో ఉంటారు. అసలు మనిద్దరం పెళ్లి చేసుకున్నామా..? అంటూ మేం జోకులు వేసుకుంటూ ఉంటాం’’ అని వారి మధ్య ఉన్న ఆత్మీయతను బయటపెట్టారు. త్వరలో తన తమ్ముడు అనంత్‌ అంబానీ.. రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ‘‘అనంత్‌ నాకు చిన్న పిల్లాడిలా అనిపిస్తుంటాడు. అందుకే నాకు రాధిక కూడా అలాగే అనిపిస్తుంటుంది. మా అమ్మ, శ్లోక, రాధిక నా జీవితంలో నాకు సన్నిహితులు’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని