Jefferies Report: భారతీయ వివాహ వైభోగమే!

భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్‌ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్‌ నివేదిక పేర్కొంది.

Published : 01 Jul 2024 03:32 IST

చదువు కంటే పెళ్లిళ్లపైనే రెట్టింపు ఖర్చు!
ఈ పరిశ్రమ పరిమాణం రూ.10 లక్షల కోట్లు
జెఫ్రీస్‌ నివేదిక 

దిల్లీ: భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్‌ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్‌ నివేదిక పేర్కొంది. ఆహారం, నిత్యావసరాల తర్వాత..దేశీయులు పెళ్లిళ్లపైనే అధికంగా ఖర్చు పెడుతున్నారని తెలిపింది. సగటు భారతీయులు చదువు కోసం వెచ్చిస్తున్న మొత్తం కంటే వివాహ వేడుకలకు రెట్టింపు ఖర్చు చేస్తున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..

ఏటా కోటి వివాహాలు

వార్షికంగా చైనాలో 70-80 లక్షలు, అమెరికాలో 20-25 లక్షల పెళ్లిళ్లు జరుగుతుండగా, మన దేశంలో  80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయని తెలిపింది. అమెరికాలో వివాహాల కోసం వెచ్చిస్తున్న 70 బి.డాలర్లతో పోలిస్తే, దాదాపు రెట్టింపు పరిమాణంలో భారత్‌లో ఖర్చు పెడుతున్నారని.. అయితే చైనాతో పోలిస్తే (170 బి.డాలర్లు) మాత్రం తక్కువగానే ఉన్నట్లు నివేదిక వివరించింది. ఆహారం, నిత్యావసరాల కోసం దేశీయులు వెచ్చిస్తున్న సుమారు రూ. 56.52 లక్షల కోట్ల (681 బి.డాలర్లు) విభాగం తర్వాత భారత్‌లో వివాహ పరిశ్రమ రెండో అతిపెద్ద వినియోగ రంగంగా ఉందని తెలిపింది.  

భారతదేశంలో వివాహాలను వేడుకలు-వ్యయాల ఆధారంగా వర్గీకరించాల్సి ఉంటుంది. వివాహాల కోసం బంగారు, వెండి ఆభరణాలు, దుస్తుల కొనుగోళ్లు అధికంగా జరుగుతుంటాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల అమ్మకాలకూ పరోక్షంగా కారణమవుతున్నాయి. ఏడాదికి 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు జరుగుతున్నందున, అంతర్జాతీయంగా అతి పెద్ద పెళ్లిళ్ల గమ్యస్థానంగా భారత్‌ మారిందని రిటైలర్ల సంఘం  తెలిపింది. మనదేశంలో వివాహ వేడుకలు ఎక్కువ రోజులు/అనేకసార్లుగా/ పలు రకాల వేడుకలుగా జరుగుతున్నందున.. పలు రకాల అమ్మకాలు చోటుచేసుకుంటున్నాయి.

సగటు వ్యయం రూ.12.5 లక్షలు

విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే భారతీయులు పెళ్లిళ్లపై అధికంగా వ్యయం చేస్తుంటారు. వారి వారి ఆదాయాలు, సంపదకు తగ్గట్లు, అంతకుమించి కూడా వివాహాలను ఆడంబరంగా నిర్వహించేందుకు ప్రాధాన్యమిస్తుంటారు. ఒక్కో పెళ్లి సగటు వ్యయం 15,000 డాలర్లు (రూ.12.5 లక్షలు) ఉంటుంది. ఇది తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ. కొందరి కుటుంబ ఆదాయం కన్నా కూడా ఇది ఎక్కువే.

అమెరికాకు పూర్తి భిన్నం

ఒక చిన్నారి ప్రీప్రైమరీ నుంచి గ్రాడ్యుయేషన్‌ వరకు చదువుపై వెచ్చించే వ్యయాల కంటే, రెట్టింపు మొత్తాన్ని మన దేశంలో వారి పెళ్లికి ఆయా కుటుంబాలు ఖర్చు చేస్తున్నాయని నివేదిక తెలిపింది. అదే అమెరికాలో అయితే మొత్తం విద్యాభ్యాసానికి అయిన ఖర్చులో, సగం మొత్తాన్నే వివాహాలకు వినియోగిస్తున్నారట.


భారీ ప్రణాళికతోనే..

న దేశంలో పెళ్లికి ప్రణాళిక కనీసం 6-12 నెలల ముందు నుంచే ప్రారంభమవుతోంది. అతి భారీ స్థాయి పెళ్లిళ్లకు 50,000 మంది వరకు అతిథులు హాజరవుతున్నారని అంచనా. పెళ్లికూతురు లెహంగాలు ఒక్కోసారి 10 కిలోల వరకు బరువుంటాయి. దేశీయంగా జరుగుతున్న మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్ళికూతుర్ల నగల రూపంలోనే ఉంటున్నాయి. ఇటలీ విలాసవంత ఉత్పత్తుల సంస్థ బుల్గరీ, 2021లో భారత్‌ కోసమే మంగళసూత్ర ఆభరణాన్ని విడుదల చేసిందంటే ఇక్కడ విపణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలంకరణకు మాత్రం ఇక్కడ ఖర్చు తక్కువే చేస్తున్నారు. చాకోలేట్‌ పానీపూరి, వాఫిల్‌ దోస, పైనాపిల్‌ ప్లేవర్డ్‌ పనీర్‌ వంటి ఆహార పదార్థాలు కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారని నివేదిక పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని