Today Stock Market: సెన్సెక్స్‌ @ 78,000

సూచీల రికార్డుల జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాంకింగ్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ చరిత్రలోనే తొలిసారి 78,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది.

Updated : 26 Jun 2024 06:59 IST

సూచీల రికార్డుల జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాంకింగ్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ చరిత్రలోనే తొలిసారి 78,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. నిఫ్టీ కొత్త రికార్డు గరిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.44% నష్టంతో 85.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.435.76 లక్షల కోట్లుగా నమోదైంది.
  • సెన్సెక్స్‌ ఉదయం 77,529.19 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడంతో ఇంట్రాడేలో 823.63 పాయింట్లు లాభపడి 78,164.71 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 712.44 పాయింట్ల లాభంతో 78,053.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 183.45 పాయింట్లు పెరిగి 23,721.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,754.15 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది.
  • సెన్సెక్స్‌ సూచీలో 15 షేర్లు పరుగులు తీశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 3.40%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.48%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.32%, టెక్‌ మహీంద్రా 1.96%, ఎల్‌ అండ్‌ టీ 1.56%, ఎస్‌బీఐ 1.10% లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ 1.64%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.29%, టాటా స్టీల్‌ 1.24% నష్టపోయాయి.
  • స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ ఐపీఓకు చివరిరోజు ముగిసేసరికి 96.98 రెట్ల స్పందన వచ్చింది.
  • అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ ఐపీఓకు మొదటి రోజు 51 శాతం స్పందన లభించింది.
  • భారత సైన్యంతో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఒప్పందం: వేతనాల ఖాతాలను నిర్వహించేందుకు భారత సైన్యంతో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా సైన్యంలో పనిచేసే వారికి రూ.1 కోటి వరకు వ్యక్తిగత ప్రమాద బీమాను అందించనుంది. 
  • దేశీయ, విదేశీ విపణుల్లో రూ.2,333 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్నట్లు కల్పతరు ప్రాజెక్ట్స్‌ ప్రకటించింది. 
  • రొమ్ము క్యాన్సర్‌ పరీక్షల అవగాహన కార్యక్రమం కోసం ప్రముఖ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఫౌండేషన్‌ ‘యూవీకెన్‌’తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు స్మార్ట్‌ఫోన్‌ సంస్థ షియామీ వెల్లడించింది. 
  • అనుబంధ సంస్థ టెక్‌ మహీంద్రా (అమెరికాస్‌)లో హెల్త్‌నెక్స్ట్‌ను విలీనం చేయనున్నట్లు టెక్‌ మహీంద్రా తెలిపింది. ఈ విలీనం జులై 1 నుంచి అమల్లోకి రానుంది.

అప్పర్‌ సర్క్యూట్‌కు అమర రాజా షేర్లు: లిథియం అయాన్‌ సెల్స్‌ టెక్నాలజీ కోసం జీఐబీ ఎనర్జీఎక్స్‌ స్లోవేకియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడంతో అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ షేర్లు దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో 19.99% పరుగులు తీసిన షేరు రూ.1,655.20 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 19.40% లాభంతో రూ.1,647 వద్ద ముగిసింది.



6 నెలల్లో 70,000 నుంచి 78,000

  • సెన్సెక్స్‌ 70,000 పాయింట్ల నుంచి 78,000 పాయింట్లకు చేరేందుకు 6 నెలల 14 రోజుల సమయం పట్టింది. 2023 డిసెంబరు 11న 70,000 పాయింట్లను అధిగమించింది. 
  • మొదటి 1000 పాయింట్లు పెరిగేందుకు సెన్సెక్స్‌కు 970 సెషన్లు పట్టింది. 1990 జులై 25న 1000 పాయింట్లకు చేరిన సెన్సెక్స్‌.. 1999 అక్టోబరులో 5000 పాయింట్లను.. ఆ తర్వాత ఏడేళ్లకు 2006 ఫిబ్రవరిలో 10,000 పాయింట్లను తాకింది. 2007 డిసెంబరులో 20,000 పాయింట్లకు దూసుకెళ్లింది. 
  • 2017 ఏప్రిల్‌లో 30,000 పాయింట్లను, 2018 జనవరిలో 35,000 పాయింట్లను, 2019 జూన్‌లో 40,000 పాయింట్లను ముద్దాడింది.
  • కొవిడ్‌-19 సంక్షోభం నుంచి కోలుకుని 2021 ఫిబ్రవరి 3న 50,000 పాయింట్లను తాకింది. 2021 సెప్టెంబరులో 60,000 పాయింట్లను, 2023 డిసెంబరు 11న 70,000 పాయింట్లను, నిన్న 78,000 పాయింట్లను నమోదుచేసింది.

100 బి. డాలర్లకు ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ: మంగళవారం ఐసీఐసీఐ బ్యాంక్‌ దుమ్మురేపింది. ఇంట్రాడేలో 3% లాభపడ్డ షేరు రూ.1207 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.48% లాభంతో రూ.1199.05 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8.43 లక్షల కోట్లుగా నమోదైంది. 100 బి.డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన అగ్రగామి 5 కంపెనీల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్‌ చేరింది. రిలయన్స్‌ 225 బి.డాలర్లు (రూ.19.67 లక్షల కోట్లు), టీసీఎస్‌ 150 బి.డాలర్ల (రూ.13.89 లక్షల కోట్లు)తో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఇంతకు ముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్‌ ఈ ఘనత సాధించాయి. ఈ ఏడాదిలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 20 శాతానికి పైగా రాణించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని