IT Returns: రిటర్నులు..ఇవన్నీ తెలుసుకున్నాకే

నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు.. నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లించాలి. నిబంధనల మేరకు ఆదాయపు పన్ను రిటర్నులనూ సమర్పించాలి. అప్పుడే ఆదాయం చట్టబద్ధమైనదిగా గుర్తింపు పొందుతుంది.

Updated : 28 Jun 2024 07:17 IST

నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు.. నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లించాలి. నిబంధనల మేరకు ఆదాయపు పన్ను రిటర్నులనూ సమర్పించాలి. అప్పుడే ఆదాయం చట్టబద్ధమైనదిగా గుర్తింపు పొందుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి గాను, ఇప్పుడు (2024-25 మదింపు సంవత్సరం) రిటర్నులు దాఖలు చేయాల్సిన తరుణం వచ్చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేమిటో చూద్దామా...

వ్యక్తులు తాము సంపాదించిన ఆదాయం, మూలధన లాభాలు తదితరాలపైన నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం పొందినప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) ఉంటుంది. మనం చేసే కొనుగోళ్లకూ మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) చేస్తుంటారు. ఆదాయపు పన్ను విభాగం ఎప్పటికప్పుడు రిటర్నులను దాఖలు చేసే విధానాన్ని సరళీకృతం చేస్తూనే ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే చాలు. 

జులై 31 లోగా

ఐటీఆర్‌ (ఆదాయపు పన్ను రిటర్నులు) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు ముందుగా గమనించాల్సిన విషయం గడువు తేదీ. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం జులై 31 ఇందుకు చివరి తేదీ. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం దీన్ని పొడిగిస్తుంది. ఆడిట్‌ పరిధిలోకి రాని వ్యక్తులందరూ విధిగా గడువులోపే రిటర్నులు దాఖలు చేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరం రిటర్నులను వీలైనంత తొందరగా సమర్పించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల చివరి నిమిషంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

పన్ను విధానం అర్థం చేసుకోండి

పన్ను చెల్లింపుదారులు తాము ఏ పన్ను విధానం ఎంచుకోవాలనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. పాత పన్ను విధానంలో మినహాయింపులు క్లెయిం చేసుకునేందుకు వీలుంటుంది. కొత్త పన్ను విధానంలో వచ్చిన ఆదాయాన్ని బట్టి, నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులకు ఆస్కారం ఉండదు. రెండు విధానాల్లోనూ కొన్ని లాభ నష్టాలున్నాయి. కాబట్టి, రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఒకసారి ఇన్‌కంట్యాక్స్‌ పోర్టల్‌లో ఉన్న కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. ఆదాయాలు, మినహాయింపులను బట్టి, కొన్నిసార్లు పాత పన్ను విధానం ప్రయోజనకరంగా ఉండొచ్చు. లేదా కొత్త పన్ను విధానమే లాభదాయకం కావచ్చు. జాగ్రత్తగా విశ్లేషించుకున్నాకే తగిన పన్ను విధానాన్ని ఎంచుకోండి.

ఏ శ్లాబులో ఉన్నారు?

ఐటీఆర్‌ను సమర్పించే ముందు.. మీరు ఏ శ్లాబులో ఉన్నారో తెలుసుకోండి. వచ్చిన ఆదాయం, అందులో అనుమతించిన మినహాయింపులు పోను పన్ను వర్తించే ఆదాయం ఎంతో చూసుకోండి. కొన్నిసార్లు వేతనం ద్వారా వచ్చిన ఆదాయానికి, వడ్డీ, డివిడెండ్లలాంటివి కలిపితే, శ్లాబు మారిపోవచ్చు. అప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, మీ ఆదాయాన్ని పూర్తిగా గణించాకే రిటర్నుల ప్రక్రియను మొదలు పెట్టండి. ఫారం 16తో పాటు వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)ను పరిశీలించండి. అప్పుడే ఎలాంటి పొరపాట్లు లేకుండా రిటర్నులు దాఖలు చేయడానికి వీలవుతుంది.

సరైన పత్రంలోనే..

వ్యక్తుల ఆదాయం, అందిన మార్గాలను బట్టి సరైన ఐటీఆర్‌ ఫారాన్ని ఎంచుకోవడం అవసరం. ఇప్పటికే ఈ పత్రాలనూ ఆదాయపు పన్ను విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. వేతనం ద్వారా ఆదాయం, ఒకే ఇంటిపై ఆదాయం, వడ్డీ, డివిడెండ్లు తదితరాల ద్వారా రూ.50లక్షల వరకూ సంపాదన ఉన్న వారు ఐటీఆర్‌-1ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు మూలధన లాభాలు, విదేశీ ఆస్తుల నుంచి ఆదాయం, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐటీఆర్‌-2, ఐటీఆర్‌-3లలో తగిన పత్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు ఐటీఆర్‌-4ను రిటర్నుల కోసం ఎంపిక చేసుకోవాలి. ఏ పత్రాలు ఎంచుకోవాలి అనే విషయంలో అనుమానాలుంటే నిపుణులను అడిగి తెలుసుకోవడం మేలు. పన్ను విభాగం సహాయ కేంద్రాన్నీ సంప్రదించవచ్చు.

బ్యాంకు వివరాలు..

ఐటీఆర్‌ను సమర్పించే ముందు బ్యాంకు ఖాతాను ధ్రువీకరించుకోవాలి. పేరు, చిరునామా, పాన్, ఆధార్‌ తదితర వివరాలు సరిగా ఉన్నాయా పరిశీలించండి. ఒకటికి మించి ఖాతాలుంటే.. పన్ను రిఫండు ఉన్నప్పుడు ఏ ఖాతాలో జమ కావాలో పేర్కొనాలి.

పత్రాలు జాగ్రత్తగా..

ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు పెట్టిన పెట్టుబడి వివరాల పత్రాలను జాగ్రత్త చేసుకోవాలి. మీ కార్యాలయంలో ఇచ్చినవి మీ దగ్గరా ఉండాలి. ఫారం-16తోపాటు ఈ పత్రాలనూ ఒకే చోట దాచి పెట్టుకోండి. డిజిటల్‌ రూపంలో వీటిని భద్రపర్చుకోవడం మేలు..

కలిపి లెక్కించాలి..

కొంతమంది గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు మారొచ్చు. ఇలాంటి సందర్భాల్లో రెండు కార్యాలయాల నుంచీ ఫారం-16 తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి మొత్తం ఆదాయంగా చూపించాలి. అలాకాకుండా ఒక సంస్థ నుంచే వచ్చిన ఆదాయాన్ని నమోదు చేస్తే, ఇబ్బందులు వస్తాయి. ఇతర వనరుల నుంచి ఆదాయాన్ని ఆర్జించిన విషయం మీకు గుర్తు లేకపోయినా వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో కనిపిస్తుంది. కాబట్టి, దాన్నీ పరిశీలించడం తప్పనిసరి. పన్ను రిటర్నులు దాఖలు చేయడం సులభమే. సొంతంగా దాఖలు చేయలేము అనుకున్నప్పుడు పన్ను నిపుణులను సంప్రదించడం మేలు. తప్పు రిటర్నులు దాఖలు చేస్తే అవి చెల్లకుండా పోతాయి. కొన్నిసార్లు అపరాధ రుసుమూ చెల్లించాల్సి వస్తుందని మర్చిపోవద్దు.


సంవత్సరం చూసుకోండి..

ఆదాయపు పన్ను రిటర్నులు గత ఆర్థిక సంవత్సరానికి అంటే 2023-24కు సంబంధించినవి. కానీ, 2024-25 అసెస్‌మెంట్‌ ఇయర్‌లో దాఖలు చేస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదు. పొరపాటున 2023-24 అసెస్‌మెంట్‌ ఇయర్‌ను ఎంచుకుంటే.. రిటర్నులు దాఖలు చేసినా ప్రయోజనం ఉండదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని