Cement sector: సిమెంట్‌ రంగంలో 2-3 శాతం వృద్ధి!

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో సిమెంట్‌ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది.

Published : 05 Jul 2024 03:58 IST

2024-25 తొలి త్రైమాసికంపై ఇక్రా అంచనా

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో సిమెంట్‌ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ కార్యకలాపాలు నెమ్మదించడంతో, సిమెంట్‌కు గిరాకీ అధికంగా లేదని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం 7-8% వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ రంగాల నుంచి సిమెంటుకు ఆరోగ్యకర గిరాకీ ఉండొచ్చని అభిప్రాయపడింది. 

ద్వితీయార్ధంపై ఆశలు: ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దృష్టి సారించడం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద అదనపు గృహాల మంజూరు, పారిశ్రామిక మూలధన వ్యయాలు మెరుగవడంతో 2024-25 రెండో అర్ధ భాగం (అక్టోబరు-మార్చి)లో సిమెంట్‌ వినియోగ పరిమాణం పెరుగుతుందని ఇక్రా వివరించింది. సిమెంట్‌ పరిశ్రమలో దిగ్గజ సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నందున, స్థిరీకరణ చోటు చేసుకోవచ్చని నివేదిక పేర్కొంది. 

  • ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్, అదానీ గ్రూప్‌ సంస్థ అంబుజా సిమెంట్స్‌ వంటి దిగ్గజాలు స్థిరీకరణకు కారణమవుతాయని తెలిపింది. మధ్య కాలానికి సామర్థ్య విస్తరణతోనే ఈ రంగం వృద్ధి కొనసాగిస్తుందని వెల్లడించింది. కొనుగోళ్లు/విలీనాల ద్వారానూ వృద్ధి సాధించేందుకు  కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయని నివేదిక తెలిపింది.
  • దేశంలోని టాప్‌-5 సిమెంట్‌ కంపెనీల మార్కెట్‌ వాటా 2015 మార్చిలో 45 శాతంగా ఉండగా, 2024 మార్చి నాటికి 54 శాతానికి పెరిగిందని ఇక్రా పేర్కొంది. 2026 మార్చి నాటికి ఇది 58-59 శాతం వరకు చేరుకోవచ్చని తెలిపింది.

లాభాలు పెరగొచ్చు: ముడి పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో, సిమెంట్‌ కంపెనీల నిర్వహణ లాభాలు 1-3%  మెరుగవుతాయని అంచనా వేసింది. గత ఏడాది స్థాయిలోనే సిమెంట్‌ ధరలు ఉంటాయని, విద్యుత్, ఇంధన ధరల ఒత్తిళ్లు తగ్గడంతో మెట్రిక్‌ టన్నుకు 1-3% నిర్వహణ లాభం పెరుగుతుందని ఇక్రా కార్పొరేట్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్, కో-గ్రూప్‌ హెడ్‌ అనుపమా రెడ్డి పేర్కొన్నారు.

సిమెంట్‌ కంపెనీలు హరిత ఇంధన వినియోగం వైపు అడుగులు వేస్తున్నాయని, 2025 మార్చి నాటికి.. ఈ కంపెనీల మొత్తం విద్యుత్‌ వినియోగంలో 40-42% హరిత ఇంధనం ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. 2023 మార్చిలో ఇది 35 శాతంగా ఉంది. దిగ్గజ సిమెంట్‌ కంపెనీలు వచ్చే 8-10 ఏళ్లలో కర్బన ఉద్గారాలను 15-17% తగ్గించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. ఇందుకోసం తక్కువ క్లింకర్, తక్కువ ఇంధనం, వేస్ట్‌ హీట్‌ రికవరీ సిస్టమ్‌ (డబ్ల్యూహెచ్‌ఆర్‌ఎస్‌) సామర్థ్యాలతో బ్లెండెడ్‌ సిమెంట్‌ వాటా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఇక్రా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని