ICICI Elevate Plan: అన్‌లిమిటెడ్‌ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!

ICICI Elevate Plan: అపరిమిత క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ కొత్త ఆరోగ్య బీమా పాలసీని తీసుకొచ్చింది. ఎలివేట్‌ పేరిట తీసుకొచ్చిన ఈ పాలసీలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Updated : 04 Jul 2024 12:36 IST

ICICI Elevate Plan | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలివేట్‌ పేరిట ఐసీఐసీఐ లాంబార్డ్‌ కొత్త ఆరోగ్య బీమా ప్లాన్‌ను (ICICI Elevate Plan) ప్రకటించింది. కృత్రిమ మేధ సాయంతో ఇది ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌ కవరేజీని సూచిస్తుంది. ఏఐ ఆధారంగా వచ్చిన తొలి బీమా పథకం ఇదే కావడం విశేషం. అపరిమిత క్లెయిం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా హామీ మొత్తం పెరగడం వంటి రైడర్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

సాధారణంగా ఒక ఆరోగ్య బీమా ప్లాన్‌ తీసుకున్నప్పుడు హామీ మొత్తానికి లోబడే కంపెనీలు చెల్లిస్తాయి. అంతకు మించి ఖర్చయినా ఇవ్వడం కుదరదు. ఎలివేట్‌ ప్లాన్‌లో (ICICI Elevate Plan) మాత్రం అందుకు భిన్నంగా ‘ఇన్ఫనైట్‌ క్లెయిం ఎమౌంట్‌’ అనే రైడర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. తద్వారా పాలసీ వ్యవధిలో ఒకసారి హామీ మొత్తంతో సంబంధం లేకుండా ఆసుపత్రి బిల్లు పూర్తిగా చెల్లిస్తారు.

ఉదాహరణకు మీరు రూ.10 లక్షల కవరేజీతో బీమా పాలసీ తీసుకున్నారనుకుందాం. ఆసుపత్రిలో చికిత్స తర్వాత బిల్లు రూ.15 లక్షలు వచ్చింది. అప్పుడు సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో అయితే కంపెనీ మీకు రూ.10 లక్షలు మాత్రమే ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని మీరు జేబు నుంచి చెల్లించాల్సిందే. అదే ఎలివేట్‌లో (ICICI Elevate Plan) ఉన్న రైడర్‌ను తీసుకున్న వారికి హామీ మొత్తంతో సంబంధం లేకుండా రూ.15 లక్షలు ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఇస్తుంది. అయితే, పాలసీ వ్యవధి మొత్తంలో ఇలా ఒకసారి మాత్రమే క్లెయిం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈ యాడ్‌-ఆన్‌ను ప్రతి ఏటా పాలసీ రెన్యువల్‌ సమయంలో జత చేసుకోవాలి. ఒక ఏడాది వద్దనుకుంటే.. తిరిగి ఎప్పటికీ తీసుకునే వీలుండదు.

30 రోజులకు వెయిటింగ్‌ పీరియడ్‌..

ఎలివేట్‌ పాలసీలో (ICICI Elevate Plan) జంప్‌ స్టార్ట్‌ ఆప్షనల్ కవర్‌లో భాగంగా ఊబకాయం, హైపర్‌ టెన్షన్‌, కరోనరీ ఆర్టరీ డిసీజ్‌, డయాబెటిస్‌, ఆస్తమా, హైపర్‌లిపిడెమియా వంటి వ్యాధులకు వెయిటింగ్‌ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించారు. అయితే, ఈ కవర్‌ను వరుసగా మూడేళ్ల కాలానికి తీసుకోవాల్సి ఉంటుంది.

అపరిమిత పునరుద్ధరణ..

రీసెట్‌ ప్రయోజనం కింద ఎలివేట్‌ పాలసీని ఎన్నిసార్లైనా పునరుద్ధరించుకోవచ్చు. ఒక ఏడాదిలో హామీ మొత్తం ఒకసారి క్లెయిం చేసుకున్న తర్వాత తిరిగి దాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అలా ఎన్నిసార్లైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

రాయితీ..

పాలసీతో పాటు ఇతర ఆరోగ్య సంరక్షణ సేవలు కూడా అందుతాయి. హెల్త్‌ అసిస్టెన్స్‌ టీమ్‌, అంబులెన్స్‌ సాయం, కొన్ని తరహా వైద్యసేవలు, ఉత్పత్తులపై రాయితీ ఉంటుంది.

నాన్‌-క్లెయిం బోనస్‌..

ఒక సంవత్సరంలో పాలసీ క్లెయిం చేసుకోకపోతే.. తర్వాత ఏడాది బోనస్‌ కింద హామీ మొత్తంలో కొంత అదనంగా చెల్లిస్తారు. క్లెయిం చేసుకోని వ్యవధిని బట్టి ఇది 20 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటుంది.

ఇవన్నింటికీ..

  • కనీసం 24 గంటలు ఆసుపత్రిలో చికిత్స పొందితే.. అక్కడయ్యే అన్నిరకాల వైద్య బిల్లులను ఎలివేట్‌ పాలసీ కింద చెల్లిస్తారు.
  • 24 గంటల కంటే తక్కువ సమయంలో ఆసుపత్రిలో ఉంటే అయ్యే డేకేర్‌ చికిత్సలన్నీ కవరవుతాయి.
  • రోబోటిక్‌ సర్జరీ, స్టెమ్‌ సెల్‌ థెరపీ, ఓరల్‌ కీమోథెరపీ వంటి 12 రకాల అత్యాధునిక చికిత్సల ఖర్చులనూ హామీ మొత్తం కింద క్లెయిం చేసుకోవచ్చు.
  • ఆసుపత్రిలో చేరడానికి 90 రోజుల ముందు అయ్యే ఇతరత్రా వైద్య ఖర్చులు కూడా కవర్‌ అవుతాయి.
  • ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన తర్వాత 180 రోజుల వరకు అయ్యే వ్యయాలను కూడా క్లెయిం చేసుకోవచ్చు.
  • ఆయుష్‌ ఆసుపత్రి, డేకేర్‌ సెంటర్‌లో జరిగే చికిత్సలకు సైతం చెల్లిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని