ICICI Lombard: 2024లో ఎఫ్‌ఎంసీజీ వృద్ధి 7-9%!

ఈ ఏడాది ఎఫ్‌ఎంసీజీ రంగం స్థిరంగా 7-9 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నివేదిక అంచనా వేసింది.

Published : 26 Jun 2024 02:16 IST

ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నివేదిక

దిల్లీ: ఈ ఏడాది ఎఫ్‌ఎంసీజీ రంగం స్థిరంగా 7-9 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నివేదిక అంచనా వేసింది. వినియోగాన్ని పెంచడంతో పాటు ఉద్యోగావకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగ వృద్ధికి మద్దతు ఇస్తాయని పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వినియోగదార్ల సన్నగిల్లిన విశ్వాసం, ప్రబలంగా ఉన్న నిరుద్యోగిత రేటు వంటి సవాళ్లను ఈ రంగం ఎదుర్కొంటోందని తెలిపింది. ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ రూ.9.1 లక్షల కోట్లతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో, ఉద్యోగాల సృష్టిలో కీలక పాత్ర పోషిస్తోందని నివేదిక వెల్లడించింది. ఎఫ్‌ఎంసీజీ ఆన్‌లైన్‌ విక్రయాల ఛానెల్‌ కూడా పెరుగుతోందని, ఇది రూ.1.7 లక్షల కోట్ల విలువ కలిగి ఉందని తెలిపింది. డిజిటల్‌ వినియోగదార్లకు సేవలు అందించేలా, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమ ఎప్పటికప్పుడు మారుతుండటం, డిజిటలీకరణ వేగవతం కావడం చూస్తున్నామని కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఇండెక్స్‌ 2023 పేరుతో రూపొందించిన నివేదిక వివరించింది. కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొందని, కొన్ని త్రైమాసికాల పాటు గ్రామీణ గిరాకీ ప్రతికూల వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. 2023 రెండో అర్ధ భాగం నుంచి పరిమాణం, విలువ పరంగా చెప్పుకోదగ్గ వృద్ధి కనిపిస్తోందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని