Indian Railways: రైల్లో లోయర్‌ బెర్త్‌ కావాలా? ఈసారి ఇలా చేయండి..

How to book lower berth tickets: రైలు ప్రయాణంలో చాలా మంది లోయర్‌ బెర్త్‌ కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ అన్నిసార్లూ సాధ్యం కాదు. ఇలా చేస్తే మాత్రం మీకు లోయర్‌ బెర్త్‌ ఖాయం.

Published : 08 Aug 2023 10:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రైళ్లలో (Indian Railways) లోయర్‌ బెర్త్‌ (Lowr berth) దొరికితే ఆ సౌకర్యమే వేరు. కూర్చున్నంత సేపూ కిటికీ నుంచి అందాలను వీక్షించొచ్చు. పడుకునేటప్పుడు పైకెక్కాల్సిన బాధలేదు. అందుకే పెద్దవాళ్లతో ప్రయాణించేవారు లోయర్ బెర్త్‌ కోసం ప్రయత్నిస్తుంటారు. వారికి టికెట్‌ బుక్‌ చేసినప్పుడు లోయర్‌ బెర్త్‌ను (Berth preference) ప్రిఫరెన్స్‌గా పెడతారు. అయినా ఏ కొద్ది మందికో మినహా లోయర్‌ బెర్తులు ఒక్కోసారి దొరక్కపోవచ్చు. ప్రయాణానికి చాలా రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసినా ఈ పరిస్థితి తలెత్తొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి?

ఓ నలుగురు వ్యక్తులు దూర ప్రయాణం చేయాలి. అందులో ఇద్దరు పెద్దవాళ్లు.. మరో ఇద్దరు మధ్య వయసు వారూ ఉన్నారనుకుందాం. ఇలాంటి సందర్భాల్లో అందరికీ కలిపి టికెట్లు బుక్‌ చేసేస్తుంటారు. ఇలా చేసినప్పుడు బెర్త్‌ ప్రిఫరెన్స్‌ను బట్టి పెద్దవారికి ఒక్కోసారి లోయర్‌ బెర్త్‌ వచ్చినా.. ఇద్దరికీ లోయర్‌ బెర్త్‌ రావడం అరుదు. ఎందుకంటే ఇది పూర్తిగా జనరల్‌ కోటా కాబట్టి. సీట్ల అందుబాటును బట్టి బెర్తుల కేటాయింపు జరుగుతుంది. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయమూ ఉండదని రైల్వే ఓ సందర్భంలో తెలిపింది. ఒకవేళ వయోభారం కారణంగా మిడిల్‌, అప్పర్‌ బెర్తుల్లో పడుకోవడానికి ఇబ్బంది పడితే టీటీఈని సంప్రదిస్తే వారికి వేరే బెర్త్‌ కేటాయిస్తారు. అదీ బెర్తుల అందుబాటును బట్టి మాత్రమే. కాబట్టి ఇకపై అలా జరగకుండా ఉండాలంటే సీనియర్‌ సిటిజన్ కోటాలో టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌ ఫైబర్‌.. ప్లాన్‌ వివరాలు ఇవే..!

సాధారణంగా సీనియర్‌ సిటిజన్‌ కోటాలో టికెట్లు అందుబాటులో ఉన్నప్పుడు బుక్‌ చేసుకున్న వారికి లోయర్‌ బెర్త్‌ను కేటాయిస్తారు. సాధారణంగా అన్ని రైళ్లలో ఈ కోటా అందుబాటులో ఉంటుంది. ఒక్కో బోగీలో స్లీపర్‌ క్లాస్‌కు అయితే ఆరు బెర్తులు, ఏసీ-3 టైర్‌, ఏసీ-2 టైర్‌ బోగీల్లో అయితే మూడేసి బెర్తులు చొప్పున సీనియర్‌ సిటిజన్‌ కోటాలో అందుబాటులో ఉంచుతారు. రైళ్లను బట్టి ఈ కోటాలో తేడా ఉండొచ్చు.

ఈ కోటాలో 60 ఏళ్లు దాటిన పురుష ప్రయాణికులను సీనియర్‌ సిటిజన్లుగా పరిగణిస్తారు. అదే స్త్రీలు అయితే 45 ఏళ్లు దాటితే వారిని సీనియర్‌ సిటిజన్లుగా పరిగణించి లోయర్‌ బెర్త్‌ కేటాయిస్తారు. గర్భిణులతో రైళ్లలో ప్రయాణించేటప్పుడు కూడా లోయర్‌ బెర్త్‌ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. అయితే, రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లలో మాత్రమే ఈ టికెట్లను బుక్‌ చేసుకోవడానికి వీలుంటుంది. ఒక పీఎన్‌ఆర్‌ నంబర్‌పై గరిష్ఠంగా ఇద్దరికి మాత్రమే సీనియర్‌ టికెట్‌ కోటాలో బుక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండు కంటే ఎక్కువ టికెట్లు బుక్‌ చేసినప్పుడు మిగిలిన టికెట్లు జనరల్‌ కోటా కింద పరిగణిస్తారు. కాబట్టి మీ ప్రయాణంలో ఒకవేళ పెద్దలు ఉంటే ఈ సారి సీనియర్‌ సిటిజన్‌ కోటాను వినియోగించుకోండి. అప్పుడు లోయర్‌ బెర్తులు తప్పకుండా దొరకుతాయి. మిగిలిన వారికి వారి బెర్తులకు అటూ ఇటూగా బెర్తులు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని