Home sales: రెండేళ్ల తర్వాత దేశంలో తగ్గిన గృహ విక్రయాలు

Home sales: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాల్లో క్షీణత నమోదైనట్లు అన్‌రాక్‌ సంస్థ తెలిపింది.

Published : 27 Jun 2024 14:28 IST

Home sales | ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో గృహ విక్రయాలు (Home sales) తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం విక్రయాలు క్షీణించాయి. ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల నమోదుకావడం రెండేళ్లలో ఇదే తొలిసారి అని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అన్‌రాక్‌ తెలిపింది. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికం (Q1)లో 1,30,370 గృహాలు అమ్ముడవగా.. రెండో త్రైమాసికం (Q2)లో ఆ సంఖ్య 1,20,340కు తగ్గినట్లు పేర్కొంది. 

2022లోనూ ఇలానే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 15 శాతం మేర విక్రయాలు క్షీణించాయి. జనవరి- మార్చి త్రైమాసికంలో 99,550 ఇళ్ల విక్రయాలు జరగ్గా.. రెండో త్రైమాసికంలో 84,925 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకుముందు త్రైమాసికంలో అధిక విక్రయాలు నమోదుకావడం ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌లో గృహ విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి కారణమని అన్‌రాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురీ పేర్కొన్నారు. దీంతోపాటు గతేడాది ప్రాపర్టీల ధరలు భారీగా పెరగడమూ మరో కారణమని విశ్లేషించారు.

ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ఇళ్ల ధరలు 7 శాతం మేర పెరిగాయని అన్‌రాక్‌ పేర్కొంది. గతేడాదితో పోల్చినప్పుడు ఈ పెరుగుదల 25 శాతంగా ఉందని తెలిపింది. గత త్రైమాసికంతో పోలిస్తే.. దేశ రాజధాని ప్రాంతంలో (NCR) 10% మేర పెరగ్గా.. హైదరాబాద్‌లో 9%, బెంగళూరులో 8% ఈ పెరుగుదల ఉందని తెలిపింది. ధరలు స్థిరంగా ఉంటే రాబోయే నెలల్లో గృహ విక్రయాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొంది. ఒక్క ఎన్‌సీఆర్‌ (6%) మినహా ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా నగరాల్లో గృహ విక్రయాల్లో క్షీణత నమోదైనట్లు నివేదిక పేర్కొంది. గతేడాదితో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో 11%, ముంబయి, బెంగళూరులో 9% చొప్పున పెరుగుదల నమోదు కాగా.. చెన్నై (9%), కోల్‌కతా (20%) నగరాల్లో గృహ విక్రయాల్లో క్షీణత నమోదైనట్లు అన్‌రాక్‌ నివేదిక వెల్లడించింది.

source: Anarock Research

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని