Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్లు యూనిట్ల లెక్క చూసుకున్నారా?

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడులు పెడుతుంటాం. ఇవన్నీ పూర్తిగా డిజిటల్‌లోనే ఉంటున్నాయి.

Published : 28 Jun 2024 01:04 IST

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడులు పెడుతుంటాం. ఇవన్నీ పూర్తిగా డిజిటల్‌లోనే ఉంటున్నాయి. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయ్యిందా లేదా అనే వివరాలూ కొన్నిసార్లు సరిగా చూసుకోం. మనం చేస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు కొనసాగుతున్నాయా? మన ఖాతాలోకి యూనిట్లు వచ్చాయా అనే వివరాలూ పట్టించుకోం. తాజాగా ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యాప్‌ ద్వారా చేసిన పెట్టుబడుల విషయంలో ఒక మదుపరి ఎదుర్కొన్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. ఆ మదుపరి యాప్‌ నుంచి మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేశారు. యాప్‌ పోర్ట్‌ఫోలియోలో చూసుకున్నప్పుడు యూనిట్లు సరిగానే కనిపించాయి. మంచి రాబడినీ చూపించాయి. కానీ, యూనిట్లను విక్రయించేందుకు ప్రయత్నించినప్పుడు వ్యత్యాసాలు వచ్చాయి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ సంఘటన డిజిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వేదికల విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తోంది. అదే సమయంలో పెట్టుబడిదారులు తమ కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశంపైనా దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెబుతోంది.

పెట్టుబడుల కోసం ఇప్పుడు ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి. డిస్కౌంట్‌ బ్రోకరేజీల పేరుతో అనేక యాప్‌లు కనిపిస్తున్నాయి. ఇందులో ఒక్కోటి వేర్వేరు ప్రయోజనాలను కల్పిస్తోంది. మదుపరులు డిజిటల్‌ పెట్టుబడుల్లో ఉన్న సౌలభ్యంతోపాటు, నష్టభయాలనూ చూసుకోవాలి. తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు చురుగ్గా ఉండటమూ కీలకమే.

వేర్వేరు చోట 

మొత్తం పెట్టుబడులు ఒకే పథకంలో ఉండకూడదు. ఇది పెట్టుబడులకు సంబంధించిన ప్రాథమిక సూత్రం. ఇప్పుడు ఇది డిజిటల్‌ ప్లాట్‌ఫారాలకూ వర్తిస్తుంది. అన్ని పెట్టుబడులూ ఒకే డిజిటల్‌ యాప్‌లో ఉంచడం మానుకోండి. విభిన్న ప్లాట్‌ఫారాలలో వైవిధ్యంగా ఉండేలా చూసుకోండి. సాంకేతిక లోపాలు ఏర్పడ్డా, ఇతరత్రా ఇబ్బందులు వచ్చినా నష్టభయం పరిమితంగా ఉంటుంది.

పర్యవేక్షిస్తూ ఉండాలి

డిజిటల్‌ యాప్‌లలో మదుపు చేశాం, అక్కడే అన్ని వివరాలూ కనిపిస్తున్నాయి కదా అని ఊరుకోవద్దు. మీ పాన్, మొబైల్‌ నంబరు, ఇ-మెయిల్‌ ఆధారంగా ఫండ్‌ సంస్థల వెబ్‌సైట్లలోకి లాగిన్‌ కావచ్చు. అక్కడ మీ పోర్ట్‌ఫోలియో వివరాలు చూసుకోవచ్చు. క్యామ్స్‌ (కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌), సీడీఎస్‌ఎల్‌ (సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌), ఎన్‌ఎస్‌డీఎల్‌ (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌) వంటి వాటిలోనూ మీ పోర్ట్‌ఫోలియో వివరాలు కనిపిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌)లో మదుపు చేస్తుంటే.. ఏ నెలకానెల వివరాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. తేడాలుంటే ఫండ్‌ సంస్థను సంప్రదించాలి.

వివరాలు భద్రంగా

మీరు చేసే ప్రతి పెట్టుబడికి సంబంధించిన వివరాలు మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. యూనిట్లను కొనుగోలు చేసినప్పుడు, కొంత మొత్తం వెనక్కి తీసుకున్న సందర్భాల్లో స్టేట్‌మెంట్లు డిజిటల్‌ రూపంలో దాచి పెట్టుకోండి. ఫండ్‌ సంస్థ, పెట్టుబడి పెట్టిన యాప్‌ నుంచి వచ్చిన ఇ-మెయిళ్లను తీసేయొద్దు. బ్యాంకు ఖాతా వివరాలూ నెలనెలా గమనిస్తూ ఉండాలి. వివాదాలు వచ్చినప్పుడు, ఇవన్నీ ఆధారాలుగా పనికొస్తాయి.

సరిచూసుకోండి..

డిజిటల్‌ వేదిక నుంచి నిర్వహించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. మీరే చేశారా లేదా ధ్రువీకరించుకోవాలి. బ్యాంకు నుంచి డబ్బు డెబిట్‌ అయినప్పుడు.. ఆ మేరకు యూనిట్లు మీ పోర్ట్‌ఫోలియోలో జమ అయ్యాయా చూసుకోవాలి. నెలవారీ స్టేట్‌మెంట్లనూ తీసుకోవాలి. మీరు మదుపు చేసిన మొత్తం, ఆ తేదీ నాడు యూనిట్‌ నికర విలువ (ఎన్‌ఏవీ), మీకు ఎన్ని యూనిట్లు వచ్చాయి లాంటి వివరాలన్నీ కనిపిస్తాయి.
మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు డిజిటల్‌ యాప్‌లు, సలహాదారులూ అందుబాటులో ఉంటారు. నేరుగా ఫండ్‌ సంస్థ కార్యాలయాలకూ వెళ్లి మదుపు ప్రారôభించేందుకు వీలుంది. బ్యాంకుల శాఖలకు వెళ్లినా, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. విశ్వసనీయమైన వేదిక ద్వారానే మీ పెట్టుబడులు కొనసాగేలా చూసుకోండి. నియంత్రణ సంస్థ అనుమతితో ఉన్న వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. ఏదైనా సమస్య వస్తే నిపుణులను సంప్రదించి, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. అవసరమైతే సెబీకి ఫిర్యాదు చేయాలి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని