Income Tax: ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?

గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి.

Published : 21 Jun 2024 00:25 IST

గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. రాని వారికి మరో 10 రోజుల్లో అందే అవకాశాలున్నాయి. మీకు ఇప్పటికే ఈ పత్రం అందితే.. మీరు చేయాల్సిన మొదటి పని.. ఫారం-16ను ఫారం-26ఏఎస్‌తో పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాతే రిటర్నులను దాఖలు చేసేందుకు సిద్ధంకండి.

న్ను రిటర్నులు దాఖలు చేసేందుకు కీలకమైన పత్రాల్లో ఫారం-16 ఒకటి. దీంతోపాటు ఫారం-26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌) అవసరమూ ఉంటుంది. ఒక వ్యక్తికి వచ్చిన అన్ని రకాల ఆదాయాలూ, వాటిపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) వివరాలతో ఫారం-26ఏఎస్‌ ఉంటుంది. వేతనంతోపాటు, బ్యాంకులు ఇచ్చిన వడ్డీ, డివిడెండ్లపై విధించిన టీడీఎస్‌లూ ఇందులో కనిపిస్తాయి. ఫారం-16లో కేవలం వేతనానికి సంబంధించిన వివరాలే ఉంటాయని మర్చిపోవద్దు. ఈ రెండు పత్రాలనూ క్రోడీకరించి ఉండేదే ఏఐఎస్‌. కాబట్టి, పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వాస్తవ ఆదాయం, పన్ను చెల్లింపులను సరిగ్గా తెలుసుకోవాలంటే ఈ మూడు పత్రాలూ పరిశీలించాల్సిందే.

వ్యత్యాసాలుంటే..

పన్ను చెల్లింపుదారులు ఆదాయం, చెల్లించిన పన్నులు అన్నీ నమోదయ్యాయా లేదా చూసుకోవాలి. ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను దగ్గర పెట్టుకొని, ఏదైనా వ్యత్యాసాలున్నాయా చూసుకోవాలి. తప్పులతో రిటర్నులు దాఖలు చేయడం మంచిది కాదు. ఈ రెండింటి మధ్య తేడా ఉన్నా, మీరు రిటర్నులు దాఖలు చేస్తే అవి చెల్లకపోయే ఆస్కారం ఉంది. నోటీసులూ రావచ్చు. జరిమానాకూ అవకాశం ఉంటుంది. కాబట్టి, రిటర్నులు దాఖలు చేయకముందే ఈ రెండింటినీ సరిపోల్చుకోవడం అవసరం.

తప్పులుంటే..

ఫారం-16, ఫారం 26ఏఎస్‌లలోని వివరాల్లో తేడాలుంటే ముందుగా మీ యాజమాన్యాన్ని లేదా టీడీఎస్‌ చేసిన వారిని సంప్రదించాలి. మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ దానిని సులభంగానే సరిచేసేందుకు అవకాశం ఉంటుంది. సవరించిన టీడీఎస్‌ను ఫైల్‌ చేసి, కొత్త ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను అందిస్తుంది. పన్ను వివరాలు సరిపోలేదని ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తే, ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లోనే దానికి స్పందన తెలియజేయొచ్చు. 

ఏఐఎస్‌నూ చూడాలి..

ఆదాయ వనరులతోపాటు, టీడీఎస్‌కు సంబంధించిన వివరాలన్నీ నిశితంగా పరిశీలించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో పన్ను విభాగం ప్రతి ఆదాయాన్నీ నమోదు చేస్తోంది. ఉదాహరణకు పన్ను రిఫండు, పొదుపు ఖాతా నుంచి వచ్చిన వడ్డీ, డివిడెండ్‌ ఆదాయం, పొందిన అద్దె, స్థిరాస్తుల క్రయవిక్రయాలు, షేర్ల లావాదేవీలు, విదేశీ చెల్లింపులు ఇలా ప్రతి అంశమూ వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో కనిపిస్తుంది. కాబట్టి, ఒకసారి ఈ పత్రాన్ని పూర్తిగా పరిశీలించాలి. ఆదాయపు పన్ను పోర్టల్‌లో లాగిన్‌ కావడం ద్వారా దీన్ని పొందవచ్చు. ఒకవేళ ఇందులో తప్పులున్నట్లు గమనిస్తే.. అక్కడే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. ఒకటికి రెండుసార్లు మీ వివరాలన్నీ పరిశీలించుకున్నాకే ఈ నిర్ణయం తీసుకోవాలి.

వివరాలు సరిపోకపోతే..

పన్ను రిటర్నులను మరింత సులభతరం చేసే క్రమంలో ఆదాయపు పన్ను విభాగం ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా దాదాపు అన్ని వివరాలూ ముందే భర్తీ చేసి ఉన్న ఐటీఆర్‌-1. మీరు పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యాక, ఫారాన్ని ఎంపిక చేసుకోగానే మీ ఆదాయం, పన్ను మినహాయింపులు, టీడీఎస్, రిఫండ్‌కు సంబంధించి దాదాపు 90 శాతానికిపైగా వివరాలూ అక్కడ ముందే ఉంటాయి. కొన్నిసార్లు ఫారం-16 వివరాలకూ, ముందే నింపి ఉన్న ఐటీఆర్‌ ఫారానికీ పొంతన ఉండకపోవచ్చు. ఇది చాలా అరుదుగానే జరుగుతుందన్నదీ ఇక్కడ గుర్తుంచుకోవాలి. 

  • ఫారం -16లోనే ఏదైనా తప్పు ఉందా అనేది ముందు చూసుకోవాలి. అక్కడ అన్ని వివరాలూ ధ్రువీకరించుకోవాలి. ఆదాయం, మినహాయింపులు, పన్నును లెక్కించడంలో ఏదైనా తేడా ఉందా చూసుకోవాలి.
  • కొన్నిసార్లు ఫారం-16లో ఉన్న వివరాలు ఐటీ విభాగం దగ్గర ఇంకా నమోదు కావడంలో ఆలస్యం కావచ్చు. ఇలాంటప్పుడు రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ రిటర్నులు దాఖలు చేసేందుకు ప్రయత్నించాలి.
  • యాజమాన్యాలు కొత్త ఫారం-16 కాకుండా, పాత పద్ధతిలో జారీ చేస్తే అప్పుడు ఐటీ పోర్టల్‌ సాంకేతికత దాన్ని సరిగ్గా తీసుకోకపోవచ్చు. 
  • పన్ను చెల్లింపుదారుడు యాజమాన్యానికి తెలియజేయని మినహాయింపులూ ఇక్కడ ఐటీఆర్‌లో కనిపించవు. కాబట్టి, ఆ వివరాలకు సంబంధించి, సరైన ధ్రువీకరణలు దగ్గర పెట్టుకొని, వాటిని నమోదు చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని