Deferred Annuity Plan: ఈ ప్లాన్‌లతో జీవితకాలం కచ్చితమైన ఆదాయం!

Deferred Annuity Plan: పదవీ విరమణ అనంతరం క్రమంతప్పకుండా కచ్చితమైన ఆదాయం కావాలనుకునేవారికి డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌లు సరిగ్గా సరిపోతాయి.

Updated : 27 Jun 2024 12:37 IST

Deferred Annuity Plan | ఇంటర్నెట్‌ డెస్క్‌: టర్మ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ ప్లాన్‌, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లతో పాటు జీవిత బీమా కంపెనీలు యాన్యుటీ ప్లాన్‌లను (Annuity Plans) కూడా అందిస్తున్నాయి. ఇవి మీరు ఎంచుకున్న వ్యవధి ప్రకారం.. స్థిరమైన, కచ్చితమైన ఆదాయాన్ని క్రమంతప్పకుండా అందిస్తాయి. చెల్లింపు విధానాన్ని బట్టి రెండు రకాల యాన్యుటీ ప్లాన్‌లు ఉన్నాయి. అవి తక్షణ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్‌లు (Deferred Annuity Plans). మొదటి దాంట్లో పథకం ప్రయోజనాలు వెంటనే అందుతాయి. మరి రెండో ప్లాన్‌ ఎలా పనిచేస్తుంది? దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూద్దాం..

డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్‌ అంటే?

డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ (Deferred Annuity Plan) అనేది జీవితాంతం క్రమంతప్పకుండా ఆదాయాన్నందించే ఒక ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌. తక్షణ ప్లాన్‌ తరహాలో కాకుండా.. మీరు ఎంచుకున్న ప్రకారం.. ప్లాన్‌ గడువు ముగిసిన కొంత కాలం తర్వాత చెల్లింపులు ప్రారంభమవుతాయి.

ఎలా పని చేస్తుంది?

మీరు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కోసం చూస్తున్నారనుకుందాం. మీ వయసు ప్రస్తుతం 30 ఏళ్లయితే 60 ఏళ్లు నిండిన తర్వాతే యాన్యుటీలను స్వీకరించాలనుకుంటే ఈ ప్లాన్‌ సరిపోతుంది. పదవీ విరమణ చేసే ముందు మీకు అదనపు ఆదాయ వనరు అవసరం లేదు. కాబట్టి డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌ని కొనుగోలు చేయడం ఉత్తమం.

ప్లాన్ నిబంధనల ప్రకారం.. కొంతమొత్తం నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలా 20 ఏళ్ల (మీకు 50 ఏళ్లు వచ్చే వరకు) వరకు కొనసాగించాలి. ప్రీమియం చెల్లించే కాలాన్ని ‘అక్యుములేషన్‌ ఫేజ్‌’ అంటారు. ఈ దశ ముగిసిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆ తర్వాత కూడా యాన్యుటీ చెల్లింపులు ప్రారంభం కాబోవు. 60 ఏళ్లు వచ్చిన తర్వాతే చెల్లింపు దశ ప్రారంభమవుతుంది. అక్కడినుంచి జీవితాంతం నెలవారీ లేదా త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన రెగ్యులర్ యాన్యుటీ చెల్లింపులను పింఛను తరహాలో అందుతాయి.

ఫీచర్లు, ప్రయోజనాలు..

  • మనకు నచ్చినట్లుగా చెల్లింపులు..

డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌లలో చెల్లింపు దశ ఎప్పుడు ప్రారంభం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మదుపర్లకు ఉంటుంది. అయితే, ప్లాన్ రకం, ప్రీమియం చెల్లింపు ఎంపికను బట్టి ఎన్నేళ్ల పాటు చెల్లింపు దశను వాయిదా వేసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది.

  • హామీతో కూడిన ఆదాయం..

మార్కెట్- అనుసంధానిత పెట్టుబడి పథకాల్లా కాకుండా, డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్ నుంచి వచ్చే రాబడికి కచ్చితమైన హామీ ఉంటుంది. మార్కెట్ల కదలికలు, వడ్డీరేట్ల వంటి వాటిపై ఆధారపడి ఉండదు. పైగా మీకు భవిష్యత్తులో ఎంత అందుతుందనేది కూడా ముందే నిర్ణయమై ఉంటుంది. తద్వారా ఆర్థిక వ్యవహారాలను ముందుగానే మెరుగైన రీతిలో ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

  • అధిక చెల్లింపులు..

డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్లలో (Deferred Annuity Plan) వడ్డీ కూడా వస్తుంది. తద్వారా అక్యుములేషన్‌తో పాటు చెల్లింపులు ప్రారంభమయ్యే వరకు కూడా వడ్డీ లభిస్తుంది. ఫలితంగా యాన్యుటీ చెల్లింపుల మొత్తం కూడా ఆ మేరకు పెరుగుతుంది.

  • ప్రీమియం చెల్లింపుల్లో వెసులుబాటు..

ప్రీమియం చెల్లింపు విషయంలోనూ వెసులుబాటు ఉంటుంది. కావాలంటే ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించొచ్చు. లేదంటే నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. ఇలా వీలును బట్టి చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.

  • కావాలంటే ఏక మొత్తం చెల్లింపు..

డిఫర్డ్‌ యాన్యుటీలోనూ (Deferred Annuity Plan) కావాలంటే ఒకేసారి ఏకమొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఎంచుకున్న వ్యవధిని బట్టి జీవితకాలం క్రమం తప్పకుండా చెల్లింపులు అందిస్తూనే ఉంటారు.

భద్రమైన రిటైర్‌మెంట్ అనంతర జీవితానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ పెట్టుబడి ఎంపికలలో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్‌లు ఒకటి. అయితే, వీటినుంచి స్వీకరించే చెల్లింపులను ‘వేతనాల నుంచి వచ్చే ఆదాయం’ కింద పరిగణిస్తారు. మీ పన్ను శ్లాబ్‌ ప్రకారం దీనికి కూడా ట్యాక్స్‌ వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు