CONCOR: కాంకర్‌లో 5-7% వాటా అమ్మకం!

కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది.

Updated : 03 Jul 2024 02:39 IST

ప్రైవేటీకరణ ప్రస్తుతానికి లేనట్లే

దిల్లీ: కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సంస్థలో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రతిపాదనకు, ఆసక్తిగల పెట్టుబడి సంస్థల నుంచి స్పందన కరవవ్వడం ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సంస్థలో 5-7% వాటా విక్రయించే అంశాన్ని ప్రభుత్వం తాజాగా పరిశీలిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ లేదా అర్హులెనౖ సంస్థాగత మదుపర్లకు షేర్ల జారీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆర్థిక సంస్థలతో కాంకర్‌ యాజమాన్యం చర్చలు ప్రారంభించిందనీ పేర్కొంటున్నారు.

ప్రభుత్వానికి 54.8% వాటా

 కాంకర్‌లో ప్రభుత్వానికి 54.8% వాటా ఉంది. ఇందులో 30.8% వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా విక్రయించాలని భావించింది. స్థల అద్దె రుసుమును తగ్గించడంలో సంస్థ అశక్తత, రైల్వే శాఖ నుంచి సహకార లేకపోవడం లాంటి వాటి కారణంగా.. ఈ సంస్థలో వాటా కొనేందుకు పెట్టుబడి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపలేదు. 

2019 నుంచీ ఇంతే

కాంకర్‌లో 30.8% వాటా విక్రయంతో పాటు, యాజమాన్య నియంత్రణ బదిలీ ప్రతిపాదనకు 2019 నవంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటో అధికారాలు లేకుండా 24% వాటాను అట్టేపెట్టుకోవాలని ప్రభుత్వం భావించినా, ఇప్పటికీ సాకారం కావడం లేదు. ‘కాంకర్‌ వ్యూహాత్మక వాటా విక్రయ ప్రతిపాదన కొన్నేళ్లుగా నెరవేరడం లేదు. తొలుత ఈ వాటా విక్రయ ప్రతిపాదనపై రైల్వే శాఖకు అభ్యంతరాలు ఉండేవి. ఆ తర్వాత స్థల అద్దె విధానానికి ఆమోదం లభించడంతో, ఈ ప్రక్రియ ముందుకు కదులుతుందని భావించినా, జరగలేదు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ‘ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయ నిర్ణయాల’పై దూకుడు ఉండకపోవచ్చు. ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమ’ని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంకర్‌ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరిగే అవకాశాల్లేవని తెలిపారు. 

మార్కెట్‌ విలువ 200% అధికం

కాంకర్‌లో వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ ప్రతిపాదనకు ఆమోదం లభించిన 2019 నవంబరుతో పోలిస్తే, ఇప్పటికి ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 200% పెరిగి రూ.62,470.95 కోట్లకు చేరింది. ఈ విలువ ప్రకారం.. ఇందులో కనీసం 5-7 శాతం వాటాను విక్రయించినా, ప్రభుత్వానికి రూ.3,500- 4,700 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


61 డిపోలు

 కాంకర్‌కు ప్రస్తుతం 61 ఇన్‌ల్యాండ్‌ కంటెయినర్‌ డిపోలు ఉన్నాయి. ఇందులో 26 డిపోలను రైల్వేల నుంచి అద్దెకు తీసుకుంది. కంపెనీ మొత్తం వార్షిక ఆదాయంలో సగానికి పైగా వాటా ఈ 26 డిపోల నుంచే వస్తోంది. తన ఇన్‌ల్యాండ్‌ టర్మినళ్లను ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్థలం- లైసెన్సు రుసుము విధానానికి బదిలీ చేసే ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరంలోనే కాంకర్‌ ప్రారంభించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించే స్థల అద్దె రుసుం పెరగకుండా నియంత్రించుకునే అవకాశం సంస్థకు ఉంటుంది. 2023-24లో రైల్వే శాఖకు స్థల అద్దె రుసుం కింద రూ.424 కోట్లను కాంకర్‌ చెల్లించింది. కొత్తగా తీసుకొచ్చిన స్థల అద్దె రుసుము విధానం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.125 కోట్లకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని