EPS New rule: ఈపీఎస్‌లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్‌డ్రా ప్రయోజనాలు

EPS rule: ఈపీఎస్‌ విత్‌డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది.

Published : 02 Jul 2024 17:51 IST

EPS rule | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల పింఛను పథకం (EPS), 1995కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కొన్ని సవరణలు చేసింది. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్నా ఉపసంహరణ ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీనివల్ల ఏటా సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, పదేళ్లు సర్వీసు పూర్తికాక ముందే సర్వీసు నుంచి వైదొలిగే ఉద్యోగులు.. ఉపసంహరించుకునే మొత్తాలకు సంబంధించి గణాంకాల్లోనూ ఈపీఎఫ్‌ఓ మరో మార్పు చేసింది.

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు పెన్షన్‌కు అర్హులుగా పరిగణిస్తారు. ఆ మేర వారికి పెన్షన్‌ లభిస్తుంది. అయితే, కొందరు కొద్ది రోజులకే సర్వీసులను విడిచిపెట్టేస్తుంటారు. అలా ఎవరైతే ఆరు నెలల పాటు ఈపీఎస్‌లో జమ చేస్తారో వారికే విత్‌డ్రా బెన్‌ఫిట్స్‌ లభిస్తున్నాయి. ఆరు నెలల కన్నా తక్కువ సమయంలోనే సర్వీసును వీడే వారికి ఎలాంటి ఉపసంహరణ ప్రయోజనాలూ అందడం లేదు. దీంతో అనేక క్లెయిమ్‌లు రిజెక్ట్‌ అవుతున్నాయని, ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఏడు లక్షల మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సవరణలు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈపీఎస్‌ చట్టం, 1995 టేబుల్‌-డికి ఈపీఎఫ్‌వో కొన్ని సవరణలు చేసింది. పదేళ్ల సర్వీసు లేనివారికి ఈపీఎస్‌లో జమైన నగదును వెనక్కి ఇచ్చేస్తారు. ఇలాంటి వారికి టేబుల్‌-డి ప్రకారం మొత్తాన్ని లెక్కించి ఇస్తారు. ఎవరైనా ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే తన ఉద్యోగానికి రాజీనామా లేదంటే పదవీ విరమణ చేయడం ద్వారా ఈపీఎస్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే... అతడి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. తాజా నిబంధనల ప్రకారం నెలల్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. దీనివల్ల ముందస్తు ఉపసంహరణపై వచ్చే మొత్తం తగ్గుతుంది.

లెక్క ఇలా..

ప్రతి ఉద్యోగి వేతనం నుంచి 12% ఈపీఎఫ్‌ ఖాతాకు వెళ్తుంది. అంతేమొత్తంలో యజమాని చెల్లించే 12% వాటాలో 8.33% ఈపీఎస్‌లోకి, మిగతా 3.67% ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం యజమాని చెల్లించే 12% వాటా (రూ.1,800)లో 8.33% అంటే రూ.1,250 ఈపీఎస్‌కు వెళ్తుంది. ఎవరైనా ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు కన్నా ముందే వైదొలిగితే.. అతడికి ఉద్యోగి మూలవేతనం + డీఏ కలిపి రూ.15 వేలుంది.ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరేళ్ల ఏడు నెలలపాటు పని చేశారు. అప్పుడు గత నిబంధన ప్రకారం ఆరేళ్ల ఏడు నెలలను మొత్తం ఏడేళ్లుగా పరిగణించి ఈపీఎస్‌ వాటా నగదును చెల్లించేవారు. రాజీనామా/విరమణ చేసినప్పుడు రూ.15 వేలు ఉన్నందున... టేబుల్‌-డి ప్రకారం ఏడేళ్ల కాలానికి 7.13 నిష్పత్తి లెక్కన చెల్లించేవారు. అంటే రూ.15,000 X 7.13 చొప్పున రూ.1,06,950 లభిస్తాయి. తాజా నిబంధనల ప్రకారం ఆరేళ్ల ఏడు నెలలు అంటే.. 79 నెలలు అవుతుంది. 79 నెలల కాలానికి నిష్పత్తి 6.69 అవుతుంది. అంటే రూ.15000 X 6.69 లెక్కన రూ.1,00,350 అందుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు