పదవీ విరమణలో తోడుగా

నా వయసు 57. మరో మూడేళ్లలో పదవీ విరమణ చేస్తాను. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు నెలకు రూ.40 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను

Updated : 28 Jun 2024 06:46 IST

నా వయసు 57. మరో మూడేళ్లలో పదవీ విరమణ చేస్తాను. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు నెలకు రూ.40 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. ఇందుకోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

జయరాం

పదవీ విరమణ తర్వాత మీకు కనీసం 15 నుంచి 20 ఏళ్ల వరకూ డబ్బు అవసరం అవుతుందని అంచనా వేసుకోవాలి. మీ పెట్టుబడులనూ అదే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.40వేలలో రూ.20వేలను మంచి పనితీరున్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.20వేలను హైబ్రిడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లకు కేటాయించండి. పదవీ విరమణ చేశాక మూడేళ్ల తర్వాత ఈ మొత్తంలో నుంచి నెలనెలా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోండి. వీలైతే పెట్టుబడిని పెంచేందుకు ప్రయత్నించండి. 

నా వయసు 41. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. దీనికన్నా ఎండోమెంట్‌ పాలసీ మంచిది అంటున్నారు. నిజమేనా?

ప్రదీప్‌

బీమా పాలసీ తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ మంచిదే. మీ వార్షికాదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఎండోమెంట్‌ పాలసీలో పొదుపు, బీమా కలిసి ఉంటాయి. ప్రీమియమూ ఎక్కువే. సాధారణంగా మూడు నుంచి అయిదు శాతం వరకూ రాబడిని అందిస్తాయి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తక్కువ ప్రీమియానికి ఎక్కువ రక్షణ అందిస్తుంది. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీల నుంచి మీ అవసరాల మేరకు టర్మ్‌ పాలసీ తీసుకోండి. పెట్టుబడుల కోసం మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి.

మా అబ్బాయి చదువులకు ఉపయోగపడేలా నెలకు రూ.15 వేల వరకూ రెండు మూడు కంపెనీల షేర్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా?

రాఘవ

ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు పెట్టాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ, నేరుగా షేర్లలో మదుపు చేసే విషయాన్ని మరోసారి ఆలోచించాలి. మంచి అవగాహన ఉన్నప్పుడే షేర్లను ఎంచుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను చూడండి. క్రమం తప్పకుండా మీ పెట్టుబడులను సమీక్షించుకోండి. మీ అబ్బాయి ఆర్థిక భద్రత కోసం మీ పేరుమీద తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి.

ఏడాది క్రితం ఉద్యోగంలో చేరాను. యాజమాన్యం అందిస్తున్న బృంద ఆరోగ్య బీమా ఉంది. ఇందులోనే కొనసాగడం మంచిదేనా? నెలకు రూ.12 వేల 
వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఏం చేయాలి?

సుధీర్‌
బృంద ఆరోగ్య బీమా పాలసీతోపాటు వ్యక్తిగత పాలసీ ఉండటం ఎంతో అవసరం. ఉద్యోగం మారినప్పుడు బృంద బీమా ఉండకపోవచ్చు. కాబట్టి, సొంతంగా పాలసీ తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.12వేలలో రూ.8వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. రూ.4వేలను ప్రజా భవిష్య నిధిలో జమ చేయండి. ఇలా చేయడం వల్ల సగటున 11 శాతం రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది.
తుమ్మ బాల్‌రాజ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని