కార్డు బాకీ తీర్చలేకపోతే

చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది.

Published : 17 May 2024 00:47 IST

చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఏం చేయాలి? తెలుసుకుందాం.

క్రెడిట్‌ కార్డు బిల్లును సకాలంలో చెల్లించేందుకు కొన్ని వ్యూహాలుంటాయి. కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తాన్ని నెలవారీ వాయిదాల (ఈఎంఐ) రూపంలోకి మార్చుకోవచ్చు, లేదా వేరే కార్డుకు ఆ బాకీని బదిలీ చేయొచ్చు. కావాలంటే.. కార్డు బాకీని వ్యక్తిగత రుణంగా మార్చుకోవడం గురించీ ఆలోచించవచ్చు.

క్రెడిట్‌ కార్డు బాకీని ఏకీకృతం చేసి, వ్యక్తిగత రుణంగా మార్చినప్పుడు ఆర్థికంగా చిక్కులు తప్పుతాయి. ఈ రుణాన్ని సులభంగా వాయిదాల్లో తీర్చేందుకు వీలవుతుంది. ఫలితంగా వడ్డీ, ఇతర రుసుములను తగ్గించుకునేందుకు వీలవుతుంది.

తక్కువ వడ్డీ రేట్లు: వ్యక్తిగత రుణాలకు క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే తక్కువ వడ్డీ ఉంటుంది. కాబట్టి, కాలక్రమేణా వడ్డీపై డబ్బు ఆదా అవుతుంది. అంతేకాకుండా బాకీని వేగంగా తీర్చేందుకు ఉపయోగపడుతుంది.

వాయిదాల్లో: కనీస బాకీ చెల్లిస్తూ, మొత్తం బిల్లును తీర్చడం కష్టంతో కూడుకున్నదే. దీనికి బదులుగా వ్యక్తిగత రుణం తీసుకొని, దాన్ని వాయిదాల్లో చెల్లిస్తూ వెళ్తే నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయొచ్చు.

క్రెడిట్‌ స్కోరు: బిల్లును తీర్చకుండా ఉంటే.. క్రెడిట్‌ స్కోరు పడిపోతుంది. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తీ పెరుగుతుంది. దీనికి బదులుగా రుణంతో ఒకేసారి బాకీ తీరిస్తే, క్రెడిట్‌ స్కోరు మెరుగయ్యే అవకాశం ఉంది.

ఫీజుల బాధ: గడువు లోపు బిల్లు చెల్లించకపోతే రుసుములు అధికంగా ఉంటాయి. రుణం తీసుకొని, చెల్లిస్తే.. వీటి బాధ ఉండదు. రుణం తీసుకునే ముందు పరిశీలించాల్సిన కొన్ని విషయాలున్నాయి. అవేమింటే..

  • మీ క్రెడిట్‌ కార్డు బిల్లును తీర్చేందుకు వ్యక్తిగత రుణం తీసుకునేందుకు మీకు అర్హత ఉందా అనేది తెలుసుకోండి. దీనికోసం ముందుగా మీ బ్యాంకును సంప్రదించండి. క్రెడిట్‌ స్కోరు, ఆదాయం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని, బ్యాంకు రుణ అర్హతను నిర్ణయిస్తుంది.
  • కొన్ని బ్యాంకులు 12 నుంచి 84 నెలల వరకూ వ్యవధితో రుణాలను ఇస్తున్నాయి. రుణాన్ని సులభంగా చెల్లించే విధంగా వాయిదాలను నిర్ణయించుకోండి.
  • రుణం రాగానే ముందుగా చేయాల్సిన పని కార్డు బాకీని తీర్చడం. అంతేకానీ ఇతర అవసరాలకు వాడితే కొత్త అప్పు మీద పడుతుందని మర్చిపోవద్దు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని