విద్యుత్‌ వాహన కంపెనీల్లో

విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే

Published : 28 Jun 2024 00:45 IST

విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే. ఈ తరహా వాహనాలకు సంబంధించి తయారీదార్ల నుంచి విడిభాగాలు, బ్యాటరీలు ఉత్పత్తి చేసే సంస్థలు, ఛార్జింగ్‌ స్టేషన్ల నిర్వహణ సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. అందువల్ల వచ్చే కొన్నేళ్ల పాటు ఈవీ విభాగం అధిక వృద్ధి నమోదు చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని, మిరే అసెట్‌ నిఫ్టీ ఈవీ అండ్‌ న్యూఏజ్‌ ఆటోమోటివ్‌ ఈటీఎఫ్‌ అనే నూతన పథకాన్ని మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 5. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం నిఫ్టీ ఈవీ అండ్‌ న్యూఏజ్‌ ఆటోమోటివ్‌ ఇండెక్స్‌లోని కంపెనీల్లో మదుపు చేస్తుంది. ఇది థీమ్యాటిక్‌ ఇండెక్స్‌. ఇందులో 33 కంపెనీలు ఉన్నాయి. అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, జేబీఎం ఆటో, రతన్‌ఇండియాలాంటివి ఉన్నాయి.


సూచీ షేర్లలో పెట్టుబడి

బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా బంధన్‌ నిఫ్టీ టోటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. నిఫ్టీ టీఆర్‌ఐ సూచీలోని కంపెనీలపై వెయిటేజీ ప్రకారం పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించడం ఈ పథకం ప్రధాన వ్యూహం. ఇండెక్స్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకానికి నిమేశ్‌ సేథ్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 5 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1,000. ఇది కొంత భిన్నమైన పథకమే. నిఫ్టీ టోటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌లో ఆర్థిక సేవల రంగానికి చెందిన కంపెనీలకు 28.2 శాతం, ఆయిల్, గ్యాస్, ఇతర ఇంధనాలకు 8.7 శాతం, ఐటీ 8.3 శాతం, ఆటోమొబైల్, వాహన విడి భాగాలు 7.4 శాతం ప్రాతినిధ్యం ఉంది. ఈ సూచీలోని అతిపెద్ద కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, టీసీఎస్‌... తదితర కంపెనీలు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని