విద్యుత్తు ఉపకరణాల సంస్థల్లో

విద్యుత్తు రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా, పంపిణీ విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది.

Published : 05 Jul 2024 00:37 IST

విద్యుత్తు రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా, పంపిణీ విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది. దీనికి అనుగుణంగా నూతన విద్యుత్తు ఉపకరణాలు, సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎనర్జీ స్మార్ట్‌ మీటర్‌ ఒక ఉదాహరణ. అదేవిధంగా అధిక సామర్థ్యం, దీర్ఘకాలం పాటు మన్నిక కల ట్రాన్స్‌ఫార్మర్లు, రెక్టిఫైయర్లు అందుబాటులోకి వస్తున్నాయి. పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ కొత్త రకాలైన కార్యకలాపాలకు అనువైన ఉత్పత్తులు, సేవలు అందించే కంపెనీలకు అధిక ఆదాయాలు, లాభాలు ఆర్జించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు రంగంలోని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఒక కొత్త పథకాన్ని ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎనర్జీ ఆపర్చునిటీస్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 16వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ప్రధానంగా విద్యుత్తు రంగానికి చెందిన కంపెనీలపై ఈ పథకం దృష్టి కేంద్రీకరిస్తుంది. కొంత పెట్టుబడిని ఆయిల్‌ అండ్‌ గ్యాస్, బయోఎనర్జీ, లూబ్రికెంట్స్‌ విభాగాలకూ కేటాయించే అవకాశం ఉంది. శంకరన్‌ నరేన్, నిత్య మిశ్రా దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. నిఫ్టీ ఎనర్జీ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. 


నష్టభయం పరిమితంగా

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా యాక్సిస్‌ నిఫ్టీ 500 ఇండెక్స్‌ ఫండ్‌ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 9వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.100. ఇది ఇండెక్స్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. నిఫ్టీ టాప్‌ 500 కంపెనీల్లో మాత్రమే ఈ పథకం పెట్టుబడి పెడుతుంది. తత్ఫలితంగా ఈ పథకంలో నష్టభయం పరిమితంగా ఉంటుంది. దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలు ఆశించవచ్చు. నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి. ‘ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ వ్యూహాన్ని ఇది అనుసరిస్తుంది. అందువల్ల పోర్ట్‌ఫోలియోలో తరచూ మార్పులు- చేర్పులు ఉండకపోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మొదటిసారి స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరులకు ఈ తరహా పథకాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా తమ పెట్టుబడుల్లో కొంత భిన్నత్వం ఉండాలనుకునే మదుపరులూ పరిశీలించవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని