రుణం తీరాకే పెట్టుబడులు..

అప్పులు లేకుండా జీవించడం.. పెట్టుబడులతో సంపద పెంచుకోవడం... ఈ రెండింటినీ సాధించడం ఎంతో కీలకమైన అంశాలు. ఇది కొంతమందికే సాధ్యం అవుతుంది.

Updated : 05 Jan 2024 06:06 IST

అప్పులు లేకుండా జీవించడం.. పెట్టుబడులతో సంపద పెంచుకోవడం... ఈ రెండింటినీ సాధించడం ఎంతో కీలకమైన అంశాలు. ఇది కొంతమందికే సాధ్యం అవుతుంది. ఇలాంటి సమయాల్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? 

వసరం ఎప్పుడూ చెప్పి రాదు. ఆసుపత్రి బిల్లుల చెల్లింపు, పిల్లల చదువుల ఖర్చు, ఇంటి మరమ్మతు, ఏదైనా వస్తువులను కొనడం.. ఇలా ఏదో ఒకదానికి వ్యక్తిగత రుణం తీసుకుంటారు చాలామంది. ఈ సమయంలో పెట్టుబడులను వాయిదా వేయక తప్పని పరిస్థితులూ ఉంటాయి. ఇలాంటి వారు ఏం చేయాలి? అప్పు తీరుస్తూనే మదుపు చేసేందుకు ఏదైనా మార్గం ఉందా?

వ్యక్తిగత రుణం తీసుకునేటప్పుడు ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. రుణానికి సంబంధించిన నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకోండి. రుణ ప్రక్రియలో ఉన్న ఖర్చులను గమనించండి. అప్పుడే మీరు రుణం తీరుస్తూనే మదుపు చేసేందుకు వీలవుతుంది.

  • వడ్డీ రేటు: ఏ తరహా రుణాలు తీసుకున్నా, వడ్డీ రేటు కనీస స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు వీలైనంత తక్కువగా ఉండాలి. అప్పుడే, అసలుపై చెల్లించే వడ్డీ భారం తగ్గుతుంది.
  • వాయిదాలు: అన్ని రకాల రుణాలకూ మీరు చెల్లించే వాయిదాలు మీ మొత్తం ఆదాయంలో 30 శాతానికి మించి ఉండకూడదు.
  • వ్యవధి: రుణాన్ని ఎన్నాళ్లలో తీర్చగలరో చూసుకోండి. వ్యవధి తక్కువగా ఉంటే, వడ్డీ భారం అంతగా ఉండదు. అప్పుడు మదుపు చేసేందుకు వీలవుతుంది.

తొందరగా తీరాలంటే..

  • మీ ఆదాయం పెరిగినప్పుడు బ్యాంకును సంప్రదించి, రుణాన్ని వేగంగా తీర్చాలనుకుంటున్నట్లు చెప్పండి. ఈఎంఐ పెంచుకోవడం ద్వారా వ్యవధిని తగ్గించుకోవచ్చు. దీనివల్ల మీ రుణం వేగంగా తీరుతుంది.
  • మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందనుకుందాం. అప్పుడు ముందస్తుగానే మొత్తం రుణం తీర్చేందుకు ప్రయత్నించండి. ఇలాంటప్పుడు బ్యాంకులు అసలులో 5 శాతం వరకూ అపరాధ రుసుము విధించే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకును సంప్రదించి, ఈ వివరాలు తెలుసుకోండి.

వీలైనంత తొందరగా అప్పు తీర్చిన తర్వాతే.. పెట్టుబడుల గురించి ఆలోచించాలి. మీ దగ్గర కొద్ది మొత్తమే మిగులు ఉంటే.. క్రమానుగత పెట్టుబడి విధానంలో మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే ప్రయత్నం చేయొచ్చు.

లాభమేనా?

చాలామంది అప్పు తీసుకొని, మదుపు చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఇది నిజంగా లాభమేనా?

ప్రస్తుతం పలు బ్యాంకులు అందిస్తున్న వ్యక్తిగత రుణాలపై వడ్డీ దాదాపు 9.15 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. కొన్ని 24 నుంచి 36 శాతం వరకూ ఇస్తున్నాయి. అదే సమయంలో ఇంత పెద్ద మొత్తంలో రాబడిని ఏ పథకమూ అందించదు.

ఉదాహరణకు పొదుపు ఖాతాలో వడ్డీ రేటు గరిష్ఠంగా 3.5 శాతం వరకూ ఉంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 3 నుంచి 7.2 శాతం వరకూ లభిస్తోంది. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు ఈక్విటీ ఫండ్లలో సగటున 11-12 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. అదే డెట్‌ ఫండ్లలో 7.5 శాతం మేరకు ప్రతిఫలం వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈక్విటీలు, డెట్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు పెట్టుబడి మొత్తం క్షీణించే ఆస్కారమూ ఉంది.

వ్యక్తిగత రుణం వడ్డీ రేటుతో పోలిస్తే పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువే ఉంటుంది. కాబట్టి, మీ దగ్గర ఉన్న మిగులు సొమ్మును ఈ రుణాన్ని తీర్చేందుకు వినియోగించడమే మేలు.

కొన్నిసార్లు.. వ్యక్తిగత రుణాన్ని ముందస్తుగా తీర్చడం సాధ్యం కాకపోవచ్చు. ఏడాది తర్వాతే దీనికి అనుమతి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీ దగ్గర ఉన్న మిగులు మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్లు, స్వల్పకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో జమ చేయాలి. రుణానికి లాకిన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత ఈ మొత్తాన్ని రుణ ఖాతాలో జమ చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు