మీ డబ్బు సురక్షితంగా..

ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌లో సులువుగా చేసేస్తున్నాం. అదే సమయంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భద్రత అనేది కీలకంగా మారుతోంది.

Published : 05 Jul 2024 00:38 IST

ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌లో సులువుగా చేసేస్తున్నాం. అదే సమయంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భద్రత అనేది కీలకంగా మారుతోంది. సైబర్‌ నేరగాళ్లు మోసపూరితంగా రహస్య సమాచారాన్ని తస్కరిస్తూ, మన కష్టార్జితాన్ని కాజేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

క్షణాల్లో చెల్లింపులు పూర్తి కావడంతో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ఎంతో ఆదరణ పొందింది. ఈ లావాదేవీలు నిర్వహించేందుకు ఎన్నో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంచుకునేటప్పుడు కచ్చితంగా అధికారిక యాప్‌ స్టోర్ల నుంచే డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేయాలి. పేరున్న యాప్‌లను వినియోగించడమే ఎప్పుడూ మంచిది. వీటితోపాటు తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు ఏమిటంటే..

  • మీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని పరిమితం చేయండి. మీ కార్డు అందించిన బ్యాంక్‌ యాప్, వెబ్‌సైటులో.. దీనికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వండి. ఆన్‌లైన్, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్మినల్స్, ట్యాప్‌ అండ్‌ పేలకు పరిమితులను విధించండి. దీనివల్ల మీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఎవరైనా అనధికారికంగా ఉపయోగించినప్పుడు ఎక్కువ నష్టం వాటిల్లకుండా ఉంటుంది. అంతర్జాతీయ లావాదేవీలను ఎప్పుడూ నిలిపి ఉంచడమే ఉత్తమం.
  • క్రెడిట్‌ కార్డు వివరాలు, పిన్, లాగిన్‌ పాస్‌వర్డ్‌ల వంటి రహస్య సమాచారాన్ని ఎప్పుడూ, ఎవరితోనూ పంచుకోవద్దు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మానుకోండి. ఉచిత వై-ఫైని ఉపయోగించడమూ మంచిది కాదు. ఇలాంటివి వాడుతున్నప్పుడు బ్యాంకింగ్‌ లావాదేవీలు చేయకూడదు. 
  • ప్రతి లావాదేవీకీ సమాచారం వచ్చేలా చూసుకోండి. ప్రాథమిక, యాడ్‌ ఆన్‌ కార్డులను వినియోగించినప్పుడు సందేశాలు ఇ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అందాలి. అనధికార లావాదేవీల కోసం మీ క్రెడిట్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. 
  • కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ కార్డుతో బిల్లు చెల్లించినప్పుడు, పిన్‌ను స్వయంగా మీరే నమోదు చేయండి. పీఓస్‌ విషయంలో ఏదైనా అసాధారణంగా అనిపిస్తే, వెంటనే సందేహించాలి.  
  • సురక్షిత చెల్లింపు గేట్‌వేలను అందించే విశ్వసనీయ వెబ్‌సైట్లలో మాత్రమే కొనుగోళ్లు చేయండి. అదనపు భద్రత కోసం మీ ఖాతాకు రెండంచెల అధీకృత విధానాన్ని ఎంచుకోండి. 
  • బీమా పాలసీల ప్రీమియం చెల్లించాలి, మీకు రావాల్సిన పార్శిల్‌ మా దగ్గర ఉండిపోయింది, షేర్ల కొనుగోలు కోసం సహాయం చేస్తాం అంటూ వచ్చే ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. వెంటనే ఫోన్‌ పెట్టేయాలి. మోసపూరిత లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని