జీఎస్‌టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం

జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్‌టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్‌ సుబ్రమణియన్‌ తెలిపారు.

Published : 05 Jul 2024 03:48 IST

రాష్ట్రాలకు పరిహారం  చెల్లించేందుకే: మాజీ సీఈఏ

దిల్లీ: జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్‌టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్‌ సుబ్రమణియన్‌ తెలిపారు. గత ఏడేళ్లుగా ఏటా జీఎస్‌టీ ఆదాయంలో, జీడీపీలో 0.5- 1 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్రం కోల్పోయిందని అన్నారు. పెట్రో ఉత్పత్తులు, మద్యాన్ని జీఎస్‌టీ విధానంలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని సలహా ఇచ్చారు. జీఎస్‌టీ విధానం అమలు ప్రక్రియలో సుబ్రమణియన్‌ కూడా కీలక పాత్ర పోషించారు. పరోక్ష విధానంలోని 17 పన్నులు, 13 సెస్సులను విలీనం చేస్తూ 2017 జులై 1న జీఎస్‌టీ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తద్వారా పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేసింది. సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనమిక్‌ ప్రోగ్రెస్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుబ్రమణియన్‌ మాట్లాడుతూ.. సమాఖ్య వ్యవస్థకు ప్రతిబింబంగా జీఎస్‌టీ విధానం నిలిచిందని అన్నారు. పేద రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరాలనే లక్ష్యానికి అనుగుణంగా చాలా వరకు జీఎస్‌టీ విధానం పనిచేసిందని తెలిపారు. జీఎస్‌టీ విధానం ప్రవేశపెట్టే ముందు ఉన్న పన్ను ఆదాయం స్థాయికి, ప్రస్తుతం జీఎస్‌టీ ఆదాయాలు చేరాయనే విషయాన్ని గుర్తు చేశారు. పన్ను రేట్లు తగ్గించినప్పటికీ వసూళ్లలో వృద్ధి కనిపిస్తోందని అన్నారు. జీఎస్‌టీ విధానంలో సంస్కరణలు అవసరమైనప్పటికీ.. వాటిని చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉండకపోవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని