పటిష్ఠంగా నష్ట నియంత్రణ వ్యవస్థలు

పాలనా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంతో పాటు నష్ట నియంత్రణ వ్యవస్థలు, విధానాలను పటిష్ఠం చేసుకోవాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నరు శక్తికాంత దాస్‌ సూచించారు.

Published : 04 Jul 2024 02:52 IST

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నరు సూచన

ముంబయి: పాలనా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంతో పాటు నష్ట నియంత్రణ వ్యవస్థలు, విధానాలను పటిష్ఠం చేసుకోవాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నరు శక్తికాంత దాస్‌ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎంపిక చేసిన ప్రైవేట్‌ రంగ బ్యాంకుల మేనేజింగ్‌ డైరెక్టర్లు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓ)తో ఆయన సమావేశాలు నిర్వహించారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యత, మూలధన నిష్పత్తి, లాభదాయకత మెరుగవుతోందని దాస్‌ పేర్కొన్నారు. ‘బ్యాంకింగ్‌ రంగం బలోపేతం కావడం, పుంజుకుందనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే పాలనా ప్రమాణాలు, నష్ట నియంత్రణ విధానాలు, నిబంధనల పాటింపు సంస్కృతి లాంటివి మరింతగా బలోపేతం కావడం ముఖ్యమ’ని దాస్‌ తెలిపారు. రుణాలు, డిపాజిట్ల వృద్ధి మధ్య వ్యత్యాసం, ద్రవ్యలభ్యత ముప్పు నిర్వహణ, అసెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ సంబంధిత సమస్యలు, హామీ రహిత రిటైల్‌ రుణాల ధోరణులు లాంటి అంశాల పైనా చర్చించారు. సైబర్‌ భద్రతను పటిష్ఠం చేసుకోవడంపైనా దృష్టి పెట్టాలని ఆయన బ్యాంకులకు సూచించారు. డిజిటల్‌ మోసాల నియంత్రణకు వినియోగదార్లకు అవగాహన కల్పించడం సహా ఇతరత్రా చర్యలు చేపట్టాలని తెలిపారు. థర్డ్‌ పార్టీ ముప్పు, ఎంఎస్‌ఎమ్‌ఈలకు రుణాలు, సీమాంతర లావాదేవీల్లో రూపాయి వాడకం పెంచడం, ఆర్‌బీఐ చేపట్టే వినూత్న కార్యక్రమాల్లో బ్యాంకుల భాగస్వామ్యం లాంటి వాటిపైనా ఆర్‌బీఐ గవర్నరు ఈ సమావేశంలో మాట్లాడారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం.రాజేశ్వర్‌ రావు, స్వామినాధన్‌తో పాటు నియంత్రణ, పర్యవేక్షణ కార్యకలాపాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని