గేమ్‌ డెవలప్‌మెంట్‌లో కృత్రిమ మేధ

సొంతంగా మొబైల్, ఆన్‌లైన్‌ గేములు ఆవిష్కరించే సంస్థ అయిన 7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఇకపై గేమ్‌ డెవలప్‌మెంట్‌లో ఏఐ (కృత్రిమ మేధ) ని విస్తృతంగా వినియోగించనుంది.

Published : 04 Jul 2024 02:49 IST

ఏఐ డివిజన్‌ను ప్రారంభించిన 7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: సొంతంగా మొబైల్, ఆన్‌లైన్‌ గేములు ఆవిష్కరించే సంస్థ అయిన 7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఇకపై గేమ్‌ డెవలప్‌మెంట్‌లో ఏఐ (కృత్రిమ మేధ) ని విస్తృతంగా వినియోగించనుంది. దీని కోసం ప్రత్యేకంగా ‘7సీస్‌ ఏఐ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎల్‌.మారుతీ శంకర్‌  వెల్లడించారు. ఏఐ నిపుణుల సహకారంతో, అతి తక్కువ సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన, ఆకర్షణీయ గేములను ఆవిష్కరించే అవకాశం తమకు లభిస్తుందని వివరించారు. వచ్చే అయిదు నుంచి పదేళ్లలో వీడియో గేమ్‌ డెవలప్‌మెంట్‌లో ఏఐ వినియోగం తప్పనిసరి కావడంతో పాటు, అనూహ్య మార్పులు సంభవిస్తాయని ప్రముఖ కన్సల్టింగ్‌ సేవల సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. దీన్ని ప్రస్తావిస్తూ, ‘ఈ అవకాశాన్ని మేం ఇప్పటి నుంచే అందిపుచ్చుకునే పనిలో ఉన్నాం’ అని మారుతీ శంకర్‌ తెలిపారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడమే కాకుండా, ఒక ‘ఏఐ గేమింగ్‌ టూల్‌’ ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ టూల్‌ను తొలిదశలో తమ సొంత అవసరాలకు వాడుకుంటామని అన్నారు. తదుపరి ఇతర వినియోగదార్లకు ఈ టూల్‌ లైసెన్స్‌ హక్కులు ఇస్తామని, దీనివల్ల తమకు రాయల్టీ లభిస్తుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని