ద్రవ్యలోటు 4 శాతమైతే రెండేళ్లలో రేటింగ్‌ పెంపు!

అప్పుల నిర్వహణ సరిగ్గా ఉండి, ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి తీసుకొస్తే, వచ్చే 24 నెలల్లో భారత రేటింగ్‌ పెంపునకు అవకాశాలు ఉంటాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ డైరెక్టరు ఈఫార్న్‌ ఫ్యూహా వెల్లడించారు.

Published : 04 Jul 2024 02:44 IST

ఎస్‌అండ్‌పీ 

దిల్లీ: అప్పుల నిర్వహణ సరిగ్గా ఉండి, ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి తీసుకొస్తే, వచ్చే 24 నెలల్లో భారత రేటింగ్‌ పెంపునకు అవకాశాలు ఉంటాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ డైరెక్టరు ఈఫార్న్‌ ఫ్యూహా వెల్లడించారు. ‘దేశ సార్వభౌమ రేటింగ్‌ను పెంచాలంటే ప్రభుత్వ ద్రవ్యలోటు (కేంద్రం, రాష్ట్రాలది కలిపి) జీడీపీలో 7 శాతం దిగువన ఉండాలి. ఇందులో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంద’ని తెలిపారు. ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి పరిమితం చేయగలమన్నది కేంద్ర ప్రభుత్వ అంచనా. 2023-24లో ద్రవ్యలోటు 5.63 శాతంగా ఉంది. 2025-26 కల్లా జీడీపీలో 4.5 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత రేటింగ్‌ను ‘బీబీబీ-’ వద్దే కొనసాగిస్తూ, భవిష్యత్‌ అంచనాను స్థిరత్వం నుంచి సానుకూలానికి ఈ ఏడాది మేలో ఎస్‌అండ్‌పీ సవరించిన సంగతి తెలిసిందే.

దేశీయంగా వినియోగం పెరగడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల వల్ల గత మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున 8% వృద్ధిని నమోదు చేసిందని ఫ్యూహా వెల్లడించారు. మధ్యకాలానికి 7% వృద్ధిని నమోదు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని తెలిపారు. ఒకవేళ మౌలిక రంగానికి అవరోధాలు తొలిగితే, వృద్ధిరేటు 8 శాతానికీ పెరగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండొచ్చని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.2% కావడం గమనార్హం. ఆసియా ప్రాంతంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నది భారతేనని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ముఖ్య ఆర్థికవేత్త (ఆసియా- పసిఫిక్‌) లూయిస్‌ కుయిజ్స్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని