మాస్‌చిప్, సోషియోనెక్ట్స్‌తో సీ-డ్యాక్‌ ఒప్పందం

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్‌చిప్‌ టెక్నాలజీస్, జపాన్‌కు చెందిన సోషియోనెక్ట్స్‌ ఇంక్‌.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ  సీ-డ్యాక్‌ (సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 03 Jul 2024 02:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్‌చిప్‌ టెక్నాలజీస్, జపాన్‌కు చెందిన సోషియోనెక్ట్స్‌ ఇంక్‌.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ  సీ-డ్యాక్‌ (సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎస్‌ఓసీ (సిస్టమ్‌ ఆన్‌ చిప్‌) ఆధారిత హెచ్‌పీసీ (హై పెర్‌ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌) ప్రాసెసర్‌ను ఈ మూడు సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తాయి. టీఎస్‌ఎంసీ (తైవాన్‌ సెమీకండక్టర్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ)కి చెందిన 5ఎన్‌ఎం టెక్నాలజీ నోడ్‌ మీద హెచ్‌పీసీ ప్రాసెసర్‌ను ఆవిష్కరించాల్సి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ స్పందిస్తూ సర్వర్‌ నోడ్స్, ఇంటర్‌కనెక్టర్స్, సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ స్టాక్‌ విషయంలో 50 శాతానికి పైగా సొంతంగా అభివృద్ధి చేయగల సత్తా సాధించినట్లు తెలిపారు. ఈ విషయంలో నూరుశాతం స్వతంత్రంగా అభివృద్ధి చేయగల స్థాయికి చేరుకోవటానికి స్వతంత్ర హెచ్‌పీసీ ప్రాసెసర్‌ ఏయూఎంను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మాస్‌చిప్‌ టెక్నాలజీస్,   సోషియో   నెక్ట్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో చిప్‌ డిజైన్‌ విషయంలో ఎంతో పురోగతి సాధించడానికి వీలు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ హెడ్‌ (సైంటిఫిక్‌ డివిజన్స్‌) డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ వివరించారు. స్వతంత్రంగా హెచ్‌పీసీ ప్రాసెసర్‌ను అభివృద్ధి చేస్తే, మనదేశం సూపర్‌కంప్యూటింగ్‌ విభాగంలోకి అడుగుపెట్టినట్లు అవుతుందని సీ-డ్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఇ.మగేష్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని