సంక్షిప్తవార్తలు(9)

జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్‌వ్యాగన్, భారత్‌లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది.

Updated : 03 Jul 2024 02:35 IST

ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియాలో మహీంద్రాకు వాటా? 

ప్రేగ్‌: జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్‌వ్యాగన్, భారత్‌లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. దేశంలో 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్ల)కు పైగా పెట్టుబడులు పెట్టి, 20 ఏళ్లకు పైగా కార్యకలాపాలు సాగిస్తున్నా, దేశీయ వాహన విపణిలో సంతృప్తికర వాటాను దక్కించుకోలేకపోవడమే ప్రస్తుతం సంస్థ యోచనకు కారణం. ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ ఇండియాలో వాటా చేజిక్కించుకునేందుకు అవకాశం ఉన్న సంస్థల్లో మహీంద్రా అండ్‌ మహీంద్రా అగ్రస్థానంలో ఉన్నట్లు, గ్రూప్‌ ప్రధాన సంస్థ స్కోడా ఆటో సీఈఓ క్లాస్‌ జెమర్‌ తెలిపారు. ఐరోపా ప్రమాణాలతో తయారై, ఖరీదు ఎక్కువగా ఉన్న తమ వాహనాలు భారత్‌లో అంతగా విక్రయం కావడం లేదని, అందుకే ఇక్కడి పోటీ సంస్థల ఉత్పత్తుల ధరల సమీపంలో కొత్త కార్లు విడుదల చేయాలన్న యోచన ఉందని వివరించారు.


ఏఐ ఆధారిత కాంక్రీట్‌ జీపీటీని ఆవిష్కరించిన అజాక్స్‌ ఇంజినీరింగ్‌ 

దిల్లీ: కాంక్రీట్, నిర్మాణ పరిశ్రమల కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫామ్‌ ‘కాంక్రీట్‌ జీపీటీ’ని ఆవిష్కరించినట్లు కాంక్రీట్‌ పరికరాల తయారీ సంస్థ అజాక్స్‌ ఇంజినీరింగ్‌ మంగళవారం వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్‌ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠి, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. నిర్మాణ, కాంక్రీట్‌ నిపుణులకు తాజా మార్కెట్‌ అంశాలు, ఆవిష్కరణలు, నియంత్రణల తాజా సమాచారంతో పాటు, నిపుణులు ధ్రువీకరించిన సాంకేతిక సమాచారాన్ని అందించడం ద్వారా వారికి సేవలు అందించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ శుభబ్రత సాహా వెల్లడించారు.


క్యాప్‌జెమిని రూ.1,000 కోట్ల పెట్టుబడులు

చెన్నై: అంతర్జాతీయ ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని, చెన్నైలో కొత్తగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. వచ్చే 3 ఏళ్లలో దీనిపై రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 5,000 సీట్ల సామర్థ్యంతో నిర్మించబోతున్న ఈ కేంద్రం 2027 ఏప్రిల్‌ నాటికి పూర్తవుతుందని, 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం ఉంటుందని తెలిపింది. వినియోగదారు అనుభవ కేంద్రాల కోసం అధునాతన ఇంజినీరింగ్‌ ల్యాబ్‌లు, ప్రత్యేక పాడ్‌లను కలిగి ఆకర్షణీయ - సహకార పని వాతావారణాన్ని ప్రోత్సహిస్తుందని సమాచారం. అధునాతన శక్తి, నీటి సామర్థ్య సాంకేతికతలను ఈ క్యాంపస్‌ ఏకీకృతం చేస్తుందని, పునరుత్పాదక పదార్థాలను వినియోగించుకుంటుందని, నిర్మాణ సమయంలో వర్షపు నీటి సంరక్షణ, సేకరణకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.


బెంగళూరులో గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ రూ.3,150 కోట్ల బుకింగ్‌లు

దిల్లీ: బెంగళూరులోని కొత్త గృహ సముదాయ ప్రాజెక్టులో 2,000కు పైగా ఫ్లాట్లకు బుకింగ్‌లు వచ్చినట్లు గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ వెల్లడించింది. వీటి మొత్తం విలువ రూ.3,100 కోట్లు అని తెలిపింది. గృహాలకు బలమైన గిరాకీ ఇందుకు దోహదం చేసిందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ‘గోద్రేజ్‌ వుడ్‌స్కేప్స్‌’గా వ్యవహరించే ఈ ప్రాజెక్టు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ బుడిగేర్‌ క్రాస్‌లో ఉంది. విలువ పరంగా, బుకింగ్‌ల పరంగా తమకు అత్యంత విజయవంతంగా ప్రారంభమైన ప్రాజెక్టుగా ఇది నిలుస్తోందని కంపెనీ తెలిపింది. గత మూడు నెలల్లో రూ.3,000 కోట్ల విక్రయాల బుకింగ్‌లతో ప్రారంభించిన రెండో ప్రాజెక్టు ఇది అని పేర్కొంది. తద్వారా దక్షిణ భారతదేశంలో 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నమోదు చేసిన విక్రయాలను ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే అధిగమించామని వెల్లడించింది. హైదరాబాద్‌ స్థిరాస్తి విపణిలోనూ అడుగుపెట్టనుండటంతో దక్షిణాదిలో తమ స్థానం మరింత బలోపేతం కానుందని గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ ఎండీ, సీఈఓ గౌరవ్‌ పాండే తెలిపారు. 


విమాన ఇంజిన్లను అప్పగించని కేసులో స్పైస్‌జెట్‌కు కోర్టు ధిక్కార నోటీసులు 

దిల్లీ: స్పైస్‌జెట్, దాని డైరెక్టర్లు, ఇతర అధికారులకు దిల్లీ హైకోర్టు మంగళవారం కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. టీడబ్ల్యూసీ ఏవియేషన్‌ క్యాపిటల్‌ అద్దె ప్రాతిపదికన స్పైస్‌జెట్‌కు అందించిన 2 బోయింగ్‌ విమానాలు, 3 విమాన ఇంజిన్లను జూన్‌ 17 లోగా వెనక్కి అప్పగించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేయగా, ఇప్పటి వరకు వాటిని తిరిగి పంపించలేదు. దీంతో కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. లీజు ప్రాతిపదికన తీసుకున్న విమానాలు, విమాన ఇంజిన్లను వెనక్కి అప్పగించేందుకు సమయం కావాలని స్పైస్‌జెట్‌ కోర్టును అభ్యర్థించగా, జూన్‌ 17లోగా తిరిగి అప్పగించాలని మే 27న కోర్టు ఆదేశించింది. టీడబ్ల్యూసీ ఏవియేషన్‌ క్యాపిటల్‌కు 14 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.116 కోట్లు) బకాయిలు చెల్లించడంలో స్పైస్‌జెట్‌ విఫలం కావడంతోనే కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను పాటించకపోవడంతో తాజాగా కోర్టు ధిక్కార నోటీసులను జారీ చేసింది.


ముడి చమురు ఉత్పత్తిపై అదాటు లాభాల పన్ను పెంపు

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై టన్నుకు రూ.6,000 చొప్పున విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ (అదాటు లాభాల పన్ను)ను ప్రభుత్వం వసూలు చేయనుంది. గతంలో ఇది టన్నుకు రూ.3,250 ఉండగా, మంగళవారం నుంచి రూ.2,750 మేర పెంచి రూ.6,000కు చేర్చింది. ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం (ఎస్‌ఏఈడీ)గా దీన్ని వసూలు చేస్తుంది. డీజిల్, పెట్రోల్, విమాన ఇంధం (ఏటీఎఫ్‌) ఎగుమతులపై ఎస్‌ఏఈడీ వసూలు చేయడం లేదు.


ఉద్యోగ నియామక సేవల విస్తరణ: ఫెనోమ్‌  

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ సంస్థలకు ఉద్యోగ నియామకాల్లో చేయూత అందించే ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత ప్లాట్‌ఫామ్‌ అయిన ఫెనోమ్, ఇదే విభాగానికి చెందిన టైడీ అనే మానవ వనరుల సాంకేతిక సంస్థను కొనుగోలు చేసింది. ఉద్యోగుల నియామకాల నుంచి, పదవీ విరమణ వరకు అన్ని రకాల సేవలను అందించే టైడీని సొంతం చేసుకోవటంతో, తమ వినియోగదార్లకు మరింత సమర్థంగా సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఫెనోమ్‌ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు మహే బైరెడ్డి తెలిపారు. టైడీ సహ-వ్యవస్థాపకులైన కిరణ్‌ మీనన్, నిఖిల్‌ గుర్జెర్, ఔరబ్‌ మాథుర్‌ ఫెనోమ్‌ బృంద సభ్యులుగా సేవలు అందిస్తారని అన్నారు. ఫెనోమ్‌ యూఎస్‌లోని ఫిల్‌డెల్ఫియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు మనదేశం (హైదరాబాద్‌) తో పాటు ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, జర్మనీ, యూకేలలో కార్యాలయాలు ఉన్నాయి.


ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న 9 కంపెనీలు  

ముంబయి: ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో పాటు 9 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, తమ సర్టిఫికెట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ (సీఓఆర్‌)లను తిరిగి అప్పగించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం వెల్లడించింది. ఇందులో 5 ఎన్‌బీఎఫ్‌సీలు ఈ తరహా వ్యాపారం నుంచి పూర్తిగా బయటకు వచ్చినందున, సీఓఆర్‌లను సరెండర్‌ చేశాయని తెలిపింది. విగ్‌ఫిన్‌ హోల్డింగ్స్, స్ట్రిప్‌ కామోడీల్, అల్లియమ్‌ ఫైనాన్స్, ఎటర్నైట్‌ ఫిన్‌వెస్ట్, ఫినో ఫైనాన్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. 3 ఎన్‌బీఎఫ్‌సీలు (అలెగ్రో హోల్డింగ్స్, టెంపుల్‌ ట్రీస్‌ ఇంపెక్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్, హేమ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) నమోదు అవసరం లేని కోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ (సీఐసీ) కోసం నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసిన తర్వాత సీఓఆర్‌లను అప్పగించాయని పేర్కొంది.


దేశ ఆర్థిక వ్యవస్థపై మీ నిర్ణయాల ప్రభావం
ఐటీ అధికారులకు సీబీడీటీ కొత్త ఛైర్మన్‌ లేఖ

దిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు తీసుకునే నిర్ణయాల ప్రభావం, దేశ ఆర్థిక వ్యవస్థ, సులభతర వాణిజ్యం, అంతర్జాతీయ లావాదేవీలపై ఉంటుందని కొత్తగా నియమితులైన సీబీడీటీ ఛైర్మన్‌ రవి అగర్వాల్‌ పేర్కొన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని ఐటీ అధికారులను ఆయన కోరారు. గత వారం అగర్వాల్‌ను సీబీడీటీ ఛైర్మన్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘మనమందరం కలిసి వృత్తినైపుణ్యం ఉన్న విభాగాన్ని నిర్మిద్దాం. అదే సమయంలో ప్రతి విభాగం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కేంద్రం పేర్కొంది. మన విభాగంలోని వేర్వేరు శాఖలు, సరైన ప్రణాళికతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నా’నని అధికారులు, సిబ్బందికి రాసిన రెండు పేజీల లేఖలో కొత్త ఛైర్మన్‌ పేర్కొన్నారు. ‘అందరూ కలిసి చర్చించి స్వల్ప, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలను రచించాలి. ఆర్థిక లావాదేవీల్లో సంక్లిష్టతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కొత్త పన్ను చెల్లింపుదార్ల నుంచి, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలున్న సంస్థలకు ఉన్న సమస్యలను మనం పరిష్కరించాలి. అందుకు మనం సిద్ధమవ్వాల’ని పిలుపునిచ్చారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని