రిలయన్స్‌ మార్కెట్‌ విలువకు మరో 100 బి. డాలర్లు జత!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ మరో 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది.

Published : 02 Jul 2024 01:44 IST

మోర్గాన్‌ స్టాన్లీ అంచనా

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ మరో 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. గత మూడు దశాబ్దాల్లో రిలయన్స్‌ తన నగదీకరణ దశల్లో 2-3 రెట్ల విలువను వాటాదార్లకు అందించింది. ప్రతి దశాబ్దంలో 60 బిలియన్‌ డాలర్లకు పైగా మార్కెట్‌ విలువను జత చేసింది. ‘ప్రస్తుతం రిలయన్స్‌ ఉన్న నాలుగో నగదీకరణ దశ భిన్నమైనది. కొత్త వ్యాపారాల్లోకి అడుపెట్టడం, దేశీయ గిరాకీ, తక్కువ పోటీ వంటివి దీనికి మద్దతుగా నిలవనున్నాయి. నాలుగో నగదీకరణ దశలో 100 బిలియన్‌ డాలర్ల వరకు మార్కెట్‌ విలువ పెరిగే అవకాశం ఉంద’ని పేర్కొంది. తన వ్యాపార ప్రణాళికలను ప్రకటించినపుడల్లా, పెట్టుబడిదార్ల అంచనాలకు మించి వాటిని సాధించడంతో రిలయన్స్‌ మార్కెట్‌ విలువ భారీగా పెరుగుతోందని మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషించింది. 1990ల తర్వాత రిలయన్స్‌ ‘అతి తక్కువ పెట్టుబడి సమయం’ ఏదైనా ఉందంటే 2021-23 నాటి 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులేనని ఆ బ్రోకరేజీ గుర్తు చేసింది. ‘కొత్త ఇంధనం, రిటైల్‌ విస్తరణ వల్ల  సంస్థాగతేతర రంగం నుంచి మార్కెట్‌ వాటాను రిలయన్స్‌ తీసుకోగలిగింది. ప్రస్తుత ఇంధన వ్యాపారాల రూపు మారుస్తుండడంతో, మూడేళ్ల తర్వాత కూడా స్థిరంగా ఆదాయాలను రిలయన్స్‌ అందిస్తుంది. ఆ సమయంలో రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయ్డ్‌(ఆర్‌ఓసీఈ) 10% పైన ఉండొచ్చు. ఈ నేపథ్యంలో 2023-24 నుంచి 2025-26 వరకు కంపెనీ ఏటా 12% సమ్మిళిత వృద్ధి రేటు(సీఏజీఆర్‌)ను నమోదు చేయగలద’ని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేస్తోంది. సోమవారం నాటి షేరు ధర ప్రకారం.. రిలయన్స్‌ మార్కెట్‌ విలువ రూ.20.63 లక్షల కోట్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని