సంక్షిప్త వార్తలు(6)

ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ దక్షిణ ప్రాంత చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం)గా అఖిలేష్‌ పాఠక్‌ బాధ్యతలు చేపట్టారు. పవర్‌గ్రిడ్‌ దక్షిణ ప్రాంత ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌-1 పరిధిలో తెలంగాణ,

Published : 02 Jul 2024 01:38 IST

పవర్‌గ్రిడ్‌ దక్షిణ ప్రాంత సీజీఎంగా అఖిలేష్‌ పాఠక్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ దక్షిణ ప్రాంత చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం)గా అఖిలేష్‌ పాఠక్‌ బాధ్యతలు చేపట్టారు. పవర్‌గ్రిడ్‌ దక్షిణ ప్రాంత ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌-1 పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్న అఖిలేష్‌ పాఠక్, 1993లో ట్రెయినీగా పవర్‌గ్రిడ్‌లో చేరారు. మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. నేపాల్‌లో పవర్‌గ్రిడ్‌ కన్సల్టెన్సీ ప్రాజెక్టులను పర్యవేక్షించారు.


బోయింగ్‌ చేతికి స్పిరిట్‌ ఏరోసిస్టమ్స్‌

రూ.39,000 కోట్లతో కొనుగోలు
మొత్తం షేర్ల మార్పిడి ద్వారానే

అర్లింగ్టన్‌: తమకు కీలక విడిభాగాలు సరఫరా చేసే స్పిరిట్‌ ఏరోసిస్టమ్స్‌ను 4.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.39,000 కోట్ల)తో, మొత్తం షేర్ల రూపంలో కొనుగోలు చేయనున్నట్లు విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ ప్రకటించింది. ఒక్కో షేరును 37.25 డాలర్లకు కొనుగోలు చేస్తుండడంతో, ఈక్విటీ విలువ 4.7 బి. డాలర్లకు చేరింది. మొత్తం లావాదేవీ విలువ 8.3 బి. డాలర్లుగా ఉంది. ఇందులో స్పిరిట్‌కు చెందిన నికర అప్పులు కలిసి ఉన్నాయి. స్పిరిట్‌ షేర్లకు గాను బోయింగ్‌ షేర్లు ఇస్తారు. ఈ షేర్ల మార్పిడి 15 ట్రేడింగ్‌ రోజుల సగటు షేరు ధర ఆధారంగా జరుగుతుందని బోయింగ్‌ పేర్కొంది. ప్రయాణికులు, ఇరు కంపెనీల ఉద్యోగులకు ఈ లావాదేవీ ప్రయోజనకరంగా ఉంటుందని బోయింగ్‌ ప్రెసిడెండ్, సీఈఓ డేవ్‌ కాల్హౌన్‌ పేర్కొన్నారు.


తయారీకి మంచిరోజులు

దిల్లీ: జూన్‌లో దేశీయ తయారీ రంగం రాణించింది. గిరాకీ పరిస్థితుల నేపథ్యంలో, కొత్త ఆర్డర్ల రాక కొనసాగడం వల్ల ఉద్యోగకల్పన కూడా రికార్డు స్థాయిలో పెరిగినట్లు ఓ సర్వే వెల్లడించింది.  హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) మేలో 57.5 పాయింట్లుగా ఉండగా.. జూన్‌లో 58.3 పాయింట్లకు చేరింది. పీఎంఐ పరిభాషలో సూచీ 50 పాయింట్లకు పైన ఉంటే ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లు, 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. మే నెలకు మించి జూన్‌లో సూచీ నమోదవ్వడం అంటే, వ్యాపార పరిస్థితులు  మెరుగయ్యాయనే సంకేతాన్నిస్తోంది. దేశీయ గిరాకీ, అధిక ఎగుమతులు, విజయవంత ప్రచారం నేపథ్యంలో, తయారీ సంస్థల విక్రయాల్లో బలమైన వృద్ధి నమోదైంది. కొత్త ఆర్డర్లు పెరగడంతో నియామకాలు చేపట్టేందుకు సంస్థలు మొగ్గు చూపాయి. ఈ సర్వే ప్రారంభించిన 2005 నుంచి చూస్తే, ఈ స్థాయిలో నియామకాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారని సర్వే తెలిపింది.


ఏఎం గ్రీన్, ఎస్‌జేవీఎన్‌ హరిత ఇంధన ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రీన్‌కో గ్రూపు సంస్థ ఏఎం గ్రీన్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌జేవీఎన్‌కు అనుబంధ సంస్థగా ఉన్న ఎస్‌జేవీఎన్‌ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌తో పునరుత్పాదక విద్యుత్తు సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎస్‌జేవీఎన్‌ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్, 4,500 మెగావాట్ల కర్బన రహిత ఇంధనాన్ని (సౌర, పవన విద్యుత్తు), ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద ఏఎం గ్రీన్‌ ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌కు సరఫరా చేస్తుంది. దీని కోసం అవసరమైన సౌర, పవన విద్యుత్తు యూనిట్లను ఎస్‌జేవీఎన్‌ గ్రీన్‌ ఎనర్జీ 3 దశల్లో ఏర్పాటు చేస్తుంది. ఈ విద్యుత్తు యూనిట్లను ఏఎం గ్రీన్‌ నెలకొల్పే పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ సదుపాయాలతో అనుసంధానించి నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తారు.

ఏఎం గ్రీన్‌ 2030 నాటికి 5 మిలియన్‌ టన్నుల వార్షిక గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 1 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌కు సమానం. ఏఎం గ్రీన్‌లో జెంటారి ఇంటర్నేషనల్‌ రెన్యూవబుల్స్‌ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్, జీఐసీ..తదితర విదేశీ సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. ఈ సందర్భంగా గ్రీన్‌కో గ్రూపు వ్యవస్థాపకుడు మహేష్‌ కొల్లి స్పందిస్తూ, పునరుత్పాదక ఇంధనాల విభాగంలో అగ్రస్థానానికి చేరుకునే దిశగా ఏఎం గ్రీన్‌ అడుగులు వేస్తోందని, దీనికి ఎస్‌జేవీఎన్‌ గ్రీన్‌ ఎనర్జీతో కుదిరిన ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. ప్రైవేటు రంగ సంస్థలకు విద్యుత్తు సరఫరా చేసే అవకాశం ఈ ఒప్పందం ద్వారా తమకు లభించినట్లు అవుతోందని ఎస్‌జేవీఎన్‌ గ్రీన్‌ ఎనర్జీ సీఈఓ అజయ్‌ సింగ్‌ వివరించారు.


రూ.31 తగ్గిన వాణిజ్య సిలిండరు ధర

ఈనాడు వాణిజ్య విభాగం: హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండరు ధర రూ.31 మేర తగ్గింది. హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధర ఇప్పటివరకు రూ.1903.50గా ఉండగా, దీన్ని ఈనెల 1 నుంచి రూ.1872.50కు సవరించినట్లు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండరు ధరలో మార్పేమీ చేయలేదు.

విమాన ఇంధన ధర 1.2% పెంపు: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను మాత్రం కిలోలీటరుకు రూ.1179.37 (1.2%) పెంచి రూ.96,148.38 చేసినట్లు ఇంధన సంస్థలు వెల్లడించాయి.


జీఎస్‌టీ జూన్‌ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లు

దిల్లీ: జూన్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు 8% పెరిగి రూ.1.74 లక్షల కోట్లకు చేరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. జీఎస్‌టీ విధానాన్ని ప్రవేశపెట్టి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ప్రభుత్వం నెలవారీ జీఎస్‌టీ వసూళ్ల వివరాలను అధికారికంగా వెల్లడించడాన్ని ఆపేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మేలో రూ.1.73 లక్షల కోట్ల మేర జీఎస్‌టీ వసూలు కాగా.. 2023 జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో వసూలైన ఐజీఎస్‌టీ నుంచి రూ.39,586 కోట్లను కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) కింద, రూ.33,548 కోట్లను రాష్ట్రాల జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) కింద కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌- జూన్‌ వరకు చూస్తే జీఎస్‌టీ మొత్తం వసూళ్లు రూ.5.57 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని