77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!

దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్‌ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి.

Updated : 01 Jul 2024 03:22 IST

సమీక్ష: దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్‌ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా చూస్తే.. జూన్‌లో హెచ్‌ఎస్‌బీసీ కాంపోజిట్‌ పీఎంఐ 60.9కు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో భారత్‌ 5.7 బిలియన్‌ డాలర్ల కరెంటు ఖాతా మిగులును సాధించింది. గత 10 త్రైమాసికాల్లో మిగులు సాధించడం ఇదే మొదటిసారి. జేపీ మోర్గాన్‌ గవర్నమెంట్‌ బాండ్‌ ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ బాండ్లను చేర్చారు. దీంతో దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కార్పొరేట్‌ వార్తలు, ప్రభుత్వ ప్రకటనలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.4% లాభంతో 86.4 డాలర్లకు చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడం ఇందుకు నేపథ్యం. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.57 నుంచి 83.34కు బలపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా మొదటి త్రైమాసిక జీడీపీని 1.4 శాతానికి సవరించారు. అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌లు 2021 ప్రారంభ స్థాయికి చేరాయి. అమెరికా కోర్‌ పీసీఈ 2.6 శాతానికి నెమ్మదించింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 2.4% లాభంతో 79,033 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 2.2% పెరిగి 24,011 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, చమురు-గ్యాస్, విద్యుత్‌ లాభపడగా.. స్థిరాస్తి, లోహ, మన్నికైన వినిమయ వస్తువుల షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.4,622 కోట్ల విలువైన షేర్లను, డీఐఐలు రూ.7,186 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. జూన్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.26,565 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 6:5గా నమోదు కావడం.. 
ఎంపిక చేసిన షేర్లలో కదలికలను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గత వారం 79,891 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసిన సెన్సెక్స్, లాభాల్లో ముగిసింది.. స్వల్పకాలంలో సూచీ మరింత పెరిగే అవకాశం ఉంది. సూచీలు పరుగులు తీసినప్పటికీ.. కొన్ని చిన్న, మధ్య స్థాయి షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. స్వల్పకాలంలో ఇదే ధోరణి కొనసాగొచ్చు. 77,400- 78,000 పాయింట్ల శ్రేణి ఎగువన సెన్సెక్స్‌ ట్రేడైనంత వరకు సానుకూలతలు కొనసాగే అవకాశం ఉంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. 

ప్రభావిత అంశాలు: దేశీయ సూచీలకు అంతర్జాతీయ సంకేతాలు దిశానిర్దేశం చేయొచ్చు. జూన్‌ నెల వాహన విక్రయ గణాంకాలు, తయారీ- సేవల పీఎంఐ, మౌలిక రంగ వృద్ధి, జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలు కీలకం కానున్నాయి. సాధారణ బడ్జెట్‌ సమీపిస్తున్న తరుణంలో షేరు/రంగం ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. షేర్ల ధరలు అధిక విలువలకు చేరడంతో, కొంత ఒడుదొడుకులకు అవకాశం ఉంది. వచ్చే కొన్ని వారాల్లో రుతుపవనాల పురోగతి కీలకం కానుంది. జులైలో మెరుగైన వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా చూస్తే.. పలు దేశాల తయారీ పీఎంఐ, జపాన్‌ వినియోగదారు విశ్వాసం, సేవల పీఎంఐ గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగం, బ్రిటన్‌ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరిగి, మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతినొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 78,467, 77,800, 76,745
తక్షణ నిరోధ స్థాయులు: 78,905, 80,100, 80,600
సెన్సెక్స్‌ 77,400- 78,000 ఎగువన ట్రేడైతే లాభాలు కొనసాగొచ్చు. 

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని