సంక్షిప్త వార్తలు

భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్‌ ఆధారిత 4జీ మొబైల్‌ బేస్‌ స్టేషన్‌ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్‌ట్రాన్‌ ఈ 4జీ బేస్‌ స్టేషన్‌ను భారత సైన్యానికి అందించింది.

Published : 01 Jul 2024 03:07 IST

భారత సైన్యం చేతికి చిప్‌ ఆధారిత 4జీ బేస్‌ స్టేషన్‌

దిల్లీ: భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్‌ ఆధారిత 4జీ మొబైల్‌ బేస్‌ స్టేషన్‌ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్‌ట్రాన్‌ ఈ 4జీ బేస్‌ స్టేషన్‌ను భారత సైన్యానికి అందించింది. గతేడాది 4జీ ఎల్‌టీఈ ఎన్‌ఐబీ (నెట్‌వర్క్‌ ఇన్‌ ఏ బాక్స్‌) సొల్యూషన్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి చెందిన ఇ-మార్కెట్‌ప్లేస్‌ పోర్టల్‌లో భారత సైన్యం బిడ్‌ దాఖలు చేసింది. ఈ బిడ్‌ను సిగ్నల్‌ట్రాన్‌ దక్కించుకుంది. సహ్యాద్రి ఎల్‌టీఈ బేస్‌ స్టేషన్‌ల్లో ఈ చిప్‌లను, సెమీకండక్టర్‌ సంస్థ సిగ్నల్‌చిప్‌ అభివృద్ధి చేసిందని సిగ్నల్‌ట్రాన్‌ వ్యవస్థాపకుడు హిమాన్షు ఖాస్నిస్‌ తెలిపారు. 2010లో 4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు చిప్‌లు తయారుచేసేందుకు ఫ్యాబ్‌లెస్‌ సెమీకండక్టర్‌ కంపెనీ సిగ్నల్‌చిప్‌ను ఖాస్నిస్, ఆయన బృందం స్థాపించింది. ఇప్పటివరకు సైన్యానికి 20 యూనిట్లు అందించామని ఖాస్నిస్‌ తెలిపారు. 2029కు భారత బేస్‌ స్టేషన్‌ విపణి విలువ 24 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.9 లక్షల కోట్ల)కు చేరుతుందని ఆయన అంచనా వేశారు. 


కోక-కోలా బాట్లింగ్‌ సంస్థ బిగ్‌ మూసివేత

దిల్లీ: బాట్లింగ్‌ అనుబంధ సంస్థ బాట్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గ్రూప్‌ (బిగ్‌)ను శీతలపానీయాల దిగ్గజం కోక-కోలా మూసివేసింది. భారత్‌లో హిందుస్థాన్‌ కోక-కోలా బెవరేజెస్‌ (హెచ్‌సీసీబీ)తో పాటు అంతర్జాతీయ బాట్లింగ్‌ కార్యకలాపాలు బిగ్‌ చేతిలోనే ఉన్నాయి. జూన్‌ 30న బిగ్‌ కార్పొరేట్‌ కార్యాలయాన్ని సంస్థ మూసివేసింది. దీంతో కోక కోలా అంతర్గత బోర్డు నియంత్రణలోకి భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలు రానున్నాయి. బాట్లింగ్‌లో వాటాలను తగ్గించుకుని, బ్రాండ్, ఉత్పత్తులపై కోక కోలా దృష్టిపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 1997లో ప్రారంభమైన హిందుస్థాన్‌ కోక-కోలా బెవరేజెస్‌కు మన దేశంలో 16 ప్లాంట్లు ఉన్నాయి. 3500 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 25 లక్షల మంది రిటైలర్‌లకు శీతల పానీయాలను సంస్థ సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్లాంట్‌లలో వాటాలను స్వతంత్ర సంస్థలకు విక్రయించడం ద్వారా రూ.2,420 కోట్లను సంస్థ సమీకరించింది. గతేడాది నవంబరులో మహారాష్ట్ర ప్లాంట్‌ కోసం రూ.1387 కోట్లు, గుజరాత్‌లో రూ.3000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది.తెలంగాణలో   రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ ఏడాది మేలో వెల్లడించింది. 


జీడీపీ గణనకు ఆధార సంవత్సరం మార్పు? 

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక ధోరణులకు, కీలక ఆర్థిక సూచీలను అనుసంధానం చేసే లక్ష్యంతో గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ (ఎఓఎస్‌పీఐ) విశ్వనాథ్‌ గోల్డర్‌ నేతృత్వంలో 26 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. జీడీపీ సహా జాతీయ గణాంకాల లెక్కింపులో ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి 2020-21కు మార్పు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గట్లుగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ), ఉత్పత్తిదారు ధరల సూచీ (పీపీఐ), వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) వంటి వాటికి ప్రస్తుత ఆధార సంవత్సరాన్ని 2020-21కు మార్చేందుకు ఈ కమిటీ సమీక్షించి సూచనలు అందజేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని