2024-25లో దేశీయ వస్తు, సేవల ఎగుమతులు రూ.66 లక్షల కోట్లు

అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 30 Jun 2024 03:12 IST

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆశాభావం

ముంబయి: అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 2023-24లో దేశీయ ఎగుమతులు 778.2 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.64.50 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇందులో వస్తువుల ఎగుమతులు 437.10 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.36 లక్షల కోట్లు) కాగా.. సేవల ఎగుమతులు 341 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.28.50 లక్షల కోట్లు)గా ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌-రష్యా, ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, ఎర్ర సముద్రం సంక్షోభం రూపంలో అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని మంత్రి అన్నారు. అలాగే ఐరోపా లాంటి కొన్ని దిగ్గజ దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఎగుమతులు పెరుగుతుండటం (మేలో 9 శాతం వృద్ధి) ఒక సానుకూల సంకేతమన్నారు. భారత్‌తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని ప్రపంచం కోరుకుంటున్న విషయాన్ని ఇది తెలియజేస్తోందని ఇక్కడ జరిగిన రత్నాలు, ఆభరణాల ఎగుమతిదార్ల కార్యక్రమంలో మాట్లాడుతూ గోయల్‌ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లకు పైగా నమోదుకావచ్చని భావిస్తున్నామని, ఇదే జరిగితే ఓ చరిత్రాత్మక రికార్డు అవుతుందని వివరించారు. గత సంవత్సరం కరెంటు ఖాతా లోటు కూడా తగ్గిందని తెలిపారు. ఎగుమతులు పెరిగితే తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. మార్చి త్రైమాసికంలో భారత్‌  5.7 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 0.6 శాతం కరెంటు ఖాతా మిగులును నమోదు చేసింది. కరెంటు ఖాతా మిగులు నమోదు కావడం గత పది త్రైమాసికాల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. విద్యుత్‌ వాహనాల వాడకం పెరిగితే చమురు దిగుమతులపై ఆధారపడటమూ తగ్గుతుందని మంత్రి తెలిపారు. 

బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎఫ్‌టీఏ చర్చల్లో పురోగతి: బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత్, బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రతిపాదనపై చర్చల్లో పురోగతి ఉండొచ్చని భావిస్తున్నట్లు మంత్రి గోయల్‌ తెలిపారు. బ్రిటన్‌లో ఎన్నికలు జులై 4న జరగనున్నాయి. ‘ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ చర్చల్లో పురోగతి ఉంటుందని అనుకుంటున్నామ’ని విలేకర్లతో మాట్లాడుతూ ఆయన అన్నారు. బ్రిటన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎఫ్‌టీఏను కుదుర్చుకోవడానికి ఇప్పటికే ఆసక్తితో ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని