రాణించిన చిన్న షేర్లు

ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్‌ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది.

Published : 30 Jun 2024 03:10 IST

2024 తొలి ఆరు నెలల్లో జోరు
ద్వితీయార్ధంలోనూ హవా కొనసాగుతుందా?

ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్‌ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది. మరి రానున్న ఆరు నెలల్లో ఎలా ముందుకెళ్లవచ్చు. వాటికున్న అధిక విలువలతోనూ పరుగులు తీయగలవా? లేదంటే ఆ విలువలే భారం కానున్నాయా?

2024 తొలి ఆరు నెలల్లో నిఫ్టీ మిడ్‌ క్యాప్, నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ సూచీలు రెండూ 21 శాతం చొప్పున పెరిగాయి. అదే సమయంలో కీలక సూచీ అయిన నిఫ్టీ మాత్రం 10.5 శాతమే పెరిగింది. అంటే చిన్న, మధ్య స్థాయి షేర్లు నిఫ్టీ కంటే రెట్టింపు లాభాలను అందించాయన్నమాట. ముఖ్యంగా నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ అయితే ఈ ఏడాదిలో ఆరు నెలల్లో నాలుగు నెలల్లో నిఫ్టీని మించిన లాభాలను ఇచ్చింది. గత ఏడాది కాలంలో చూస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 51%, స్మాల్‌క్యాప్‌ సూచీ 60 శాతం మేర పరుగులు తీశాయి. అదే సమయంలో నిఫ్టీ 26.5 శాతం మేర పెరిగింది. 

సానుకూలతలు ఇవీ..

ఆర్థిక మూలాలు బలంగా ఉండడం చిన్న, మధ్య స్థాయి షేర్లకు కలిసివచ్చింది. రిటైల్‌ మదుపర్లు భారీగా ఆసక్తి చూపడం, కార్పొరేట్‌ ఫలితాలూ బాగుండడం ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య కూడా పెరిగింది. ఇది కాస్తా మ్యూచువల్‌ ఫండ్‌లు, సిప్‌ల నుంచి ఈ షేర్లలోకి పెట్టుబడులు కొనసాగేలా చేశాయి. వీటికి తోడు చిన్న, మధ్య స్థాయి కంపెనీలుండే స్థిరాస్తి, రక్షణ వంటి రంగాలు బలమైన ఫలితాలను నమోదు చేయడమూ కలిసివచ్చిన అంశంగా చెప్పవచ్చు. 

ద్వితీయార్ధంలో జోరు కొనసాగుతుందా?

ఇప్పటికే చిన్న, మధ్య స్థాయి విభాగాల్లో విలువలు భారీగా పెరిగాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందువల్ల ద్వితీయార్ధంలో మోస్తరు పనితీరుకే ఇవి పరిమితం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఈ అధిక విలువల వల్ల ఊగిసలాటలకు ఆస్కారం ఉంటుందని, జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని మదుపర్లకు సూచిస్తున్నారు. అయితే మధ్య, చిన్న స్థాయి షేర్లలో నాణ్యమైన వాటికి ఇంకా 5-6 శాతం మేర లాభాలు అందించే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి అధిక నష్టభయం భరించగలిగే శక్తి ఉన్న వారు అధిక ప్రతిఫలాల కోసం ప్రయత్నించొచ్చని చెబుతున్నారు.


బడ్జెట్, ఫలితాలు కీలకం

మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్ల జోరు కొనసాగుతుందా లేదా అన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంది. జులైలో జరగబోయే కేంద్ర బడ్జెట్‌ అందులో ఒకటి కాగా.. 2024-25 తొలి త్రైమాసిక ఫలితాలు రెండోదని అంటున్నారు. బడ్జెట్‌లో ఆసక్తికర ప్రకటనలు ఉండడంతో పాటు క్యూ1 ఫలితాలు రాణిస్తే గనుక మదుపర్లు ఈ షేర్ల వైపు మరింత మొగ్గు చూపేందుకు అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య స్థాయి షేర్ల విషయంలో దుందుడుకు కొనుగోళ్లు మంచిది కాదని.. కొంత లాభాల స్వీకరణ చేయడం ఉత్తమమని అంటున్నారు. దీర్ఘకాలానికి మాత్రం ఇవి బలంగా కనిపిస్తున్నందున.. ఆ దృష్టితో కొనుగోళ్లు మంచిదేనని చెబుతున్నారు. కాబట్టి సహేతుక విలువల వద్ద ఉండి, పెద్దగా లాభాలు చూపని షేర్ల వైపు దృష్టి సారించొచ్చని సూచిస్తున్నారు.


ఈనాడు వాణిజ్య విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని