సెల్‌కాన్‌ గ్రూపు నుంచి వైఫై-6 రౌటర్లు

మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, యాక్సెసరీలు అందిస్తున్న సెల్‌కాన్‌ గ్రూపు వైఫై-6 రౌటర్ల విభాగంలోకి అడుగుపెడుతోంది.

Published : 30 Jun 2024 03:08 IST

తిరుపతిలోని ఈఎంసీ-1 క్లస్టర్‌లో ఆగస్టు నుంచి ఉత్పత్తి

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన జడ్‌టీఈ ప్రతినిధులు సచిన్‌ బాత్రా, లేవో ఛావ్, గోవో జన్, సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు, రమీందర్‌ సోయిన్‌

ఈనాడు, హైదరాబాద్‌: మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, యాక్సెసరీలు అందిస్తున్న సెల్‌కాన్‌ గ్రూపు వైఫై-6 రౌటర్ల విభాగంలోకి అడుగుపెడుతోంది. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్‌ మానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ-1) లోని సెల్‌కాన్‌ రిసొల్యూట్‌కు చెందిన కొత్త ప్లాంటులో ఈ ఏడాది ఆగస్టు నుంచి    వైఫై-6 రౌటర్లను ఉత్పత్తి చేయనున్నారు. దీని కోసం చైనా దిగ్గజ సంస్థ జడ్‌టీఈ టెలికాంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెల్‌కాన్‌ రిసొల్యూట్‌ ప్లాంటులో నెలకు 2 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చని, దేశీయ మార్కెట్‌ అవసరాలు తీర్చడంతో పాటు విదేశాలకు రౌటర్లను ఎగుమతి చేయాలనేది తమ లక్ష్యమని సెల్‌కాన్‌ గ్రూపు సీఎండీ వై.గురు వెల్లడించారు. ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు పెంచుతామన్నారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వేగాన్ని పెంపొందించడంలో స్మార్ట్‌ సిటీల అభివృద్ధిలో, నగరాల్లో ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించడంలో వైఫై-6 సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జడ్‌టీఈ టెలికాం ఇండియా సీఈఓ లేవో ఛావ్, రిసొల్యూట్‌ గ్రూపు వ్యవస్థాపకుడు రమీందర్‌ సోయిన్‌లతో కలిసి వై.గురు అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌  ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. జడ్‌టీఈ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావడం శుభసూచకమని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ సంస్థ తన అన్ని రకాలైన ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేయడానికి ముందుకు రావాలని లోకేశ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని